పాకిస్థాన్‌ను తాలిబన్ ఫైటర్లు ఆక్రమిస్తారా?
పాకిస్థాన్ - ఆప్ఘనిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సరిహద్దుల్లోని బార్మల్ జిల్లాల్లో పాకిస్తాన్ సైనికులు జరిపిన వైమానికి దాడులపై ఆప్ఘనిస్థాన్ పాలకులు కన్నెర్ర జేశారు. పాక్ వైమానిక దాడుల్లో 46 మంది ముఖ్యంగా మహిళలు, చిన్నారులు చనిపోవడంతో తాలిబన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాడులను అనాగరిక చర్యగా పేర్కొనడంతో పాటు పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరించింది.
అఫ్ఘానిస్థాన్‍లోని పాక్ రాయబారిని కూడా పిలిచి తీవ్ర నిరసన తెలిపింది. ఆ వెంటనే సుమారు 15 వేల మంది తాలిబాన్ ఫైటర్లు కాబుల్, కాందహార్, హెరాత్ నుంచి పాకిస్థాన్‌లోని ఖైబర్ పుంఖ్వా ప్రావిన్స్‌లో మీర్ అలీ సరిహద్దు వైపు కదులుతున్నారు. అయితే తాలిబాన్ల శిక్షణ శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిపామని పాక్ వాదిస్తోంది. అసలే సరిహద్దు వెంబడి ఉన్న తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)తో పడలేకపోతున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం కూడా శత్రువుగా మారింది. దీంతో ఇద్దరు శత్రువులను ఎదుర్కోవడం పాకిస్థాను సవాలేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.