శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (11:18 IST)

చైనాలో వైద్య విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల భవిత ప్రశ్నార్థకం!!

గతంలో ఎన్నడూ లేనంతగా భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. ఒకవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు చైనా దుస్సాహసానికి తెగబడుతోంది. చైనా పీపుల్స్ ఆర్మీ దుశ్చర్యలను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. దీంతో డ్రాగన్ కంట్రీకి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. 
 
తాజాగా, తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై భారత్‌ దాదాపు పట్టు సాధించింది. సరస్సు దక్షిణ ప్రాంతంలోకి చొరబడేందుకు చైనా గత నెల 30వ తేదీన చేసిన ప్రయత్నాలను వమ్ముచేసిన భారత సైన్యం.. అక్కడి వ్యూహాత్మక శిఖరాలపై స్థావరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర ప్రాంతంలోనూ బలగాలను మోహరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 
 
అంతేకాకుండా, పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతం మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని... వ్యూహాత్మక ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో చైనా బిత్తరపోయింది. ఈ స్థావరాల ఏర్పాటుతో చైనా కదలికలను గమనించేందుకు భారత్‌కు అవకాశం కలిగింది. ఇప్పుడు సరస్సు ఉత్తర ప్రాంతాన్ని కూడా అధీనంలోకి తీసుకుని చైనా బలగాలకు అభిముఖంగా మోహరించింది.
 
ఈ విధంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గత యేడాది చైనాలో 20 వేల మంది భారతీయ విద్యార్థులు వివిధ వైద్య విద్యా కోర్సుల్లో చేరారు. వీరంతా వేసవి సెలవులకు తమతమ ప్రాంతాలకు చేరుకున్నాయి. ఇంతలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించింది. ఈ కారణంగా విదేశీ విద్యార్థుల పునరామగమనంపై చైనా పాలకులు ఆంక్షలు విధించారు. తదుపరి సూచనలు చేసేవరకు వారిని అనుమతించబోమని తెలిపింది. ఈ కారణంగా ఈ విద్యార్థుల భవితవ్యం ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది.