2024 నోబెల్ శాంతి బహుమతి ఎవరికిచ్చారు?
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2024 జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థను వరించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన ఈ సంస్థ పోరాడుతోంది. ప్రపంచాన్ని ఆణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి చేస్తుండటంతోపాటు బాధితుల జీవితగాథల్ని ఉదరహిస్తూ మరోసారి అణ్వాయుధాలను వాడకుండా ప్రయత్నాలు చేస్తున్నందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.
హిరోషిమా, నాగసాకి అణుబాంబు నుంచి ప్రాణాలతో బయటపడిన వారు శరీరక సమస్యలు విషాద జ్ఞాపకాలతో జీవిస్తున్నప్పటికీ వారిని గౌరవించాలని భావిస్తున్నాం. శాంతి, విశ్వాసం పెంపొందించడానికి వారి విలువైన అనుభవాలను ఉపయోగించుకునేందుకు శాంతి బహుమతిని ఇవ్వాలని నిర్ణయించాం అని నోబెల్ బృందం పేర్కొంది. జపాన్ నగరాల్లో అణ్వాయుధాల బారినపడిన బాధితుల ఉద్యమాన్ని హిబాకుషాగా పేర్కొన్నారు. దీనిలో జపాన్‌కు చెందిన 47 రాష్ట్రాల్లో పోరాడుతున్న సంస్థల ప్రతినిధులు ఉన్నారు.
మరోవైపు, వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబరు 14వ తేదీ వరకు కొనసాగనుంది. వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలతోపాటు సాహిత్యంలో నోబెల్ గ్రహీతల పేర్లను ఇప్పటికే వెల్లడించగా, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. అక్టోబరు 14వ తేదీన అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.