పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)
పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ కారణంగా గత జూన్ నెల నుంచి ఇప్పటివరకు 675 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గిల్గిట్ బల్టిస్థాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రాంతాల్లో అత్యధికంగా చనిపోయారు. డజన్ల సంఖ్యలో ప్రజలు, పర్యాటకులు గల్లంతయ్యారు. మన్ సేహ్హా జిల్లా సిరాన్‌లో లోయలో కొండ చరియలు విరిగిపడి రహదారులు మూసుకునిపోయాయి.
ఆ ప్రాంతంలో చిక్కుకున్న 1300 మంది పర్యాటకులను విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. ఈ సీజన్‌లో పాక్‌లో వర్షాలు కారణంగా మరణించిన వారి సంఖ్య 675కు దాటింది. మృతులకు పాక్ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
కాగా, పాకిస్థాన్ 75 శాతం నీటి అవసరాలను తీర్చగలిగే గిల్గిట్ - బాల్టిస్థాన్ భారీ హిమనీనదాలకు నిలయం. ఆయా ప్రాంతాల్లో హిమనీనదాలు కరిగి మెరుపు వరదలు పోటెత్తే అవకాశం ఉందని పర్యాటకులను ఆయా ప్రాంతాలకు వెళ్లవద్దని పాక్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గ్లోబల్ వార్మిగ్ కారణంగా పాక్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతోంది. హిమనీనదాలు కరిగి ఆకస్మిక వరదలు పోటెత్తుతున్నాయి. 2022లో సంభవించిన వరదల్లో 1700 మంది చనిపోవడమే కాక, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది.