శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:45 IST)

శరవేగంగా పెరుగుతున్న ఈజిప్ట్ జనాభా

ఈజిప్ట్‌ జనాభా శరవేగంగా పెరుగుతోంది. ఫలితంగా ఆ దేశ జనాభా పది కోట్ల స్థాయికి చేరింది. ఈ విషయాన్ని ఆ దేశ జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించింది. పరిమిత వనరులతో ఇప్పటికే తలకు మించిన జనాభా భారంతో వున్న దేశానికి ఈ పెరుగుదల సమస్యను మరింత జటిలం చేస్తోందని ఈ సంస్థ వ్యాఖ్యానించింది. 
 
గతంలో 2017లో ఈజిప్ట్‌లో జనగణన తరువాత ఇప్పుడు 70 లక్షల మంది అదనంగా చేరారు. ఏటా 2.8 శాతం వంతున 1960 తరువాత ఇప్పటి వరకూ ఈజిప్ట్‌ జనాభా మూడు రెట్లకు పైగా పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల 1982లో గరిష్ట స్థాయిలో నమోదు కావటం విశేషం. 
 
అరబ్‌ ప్రపంచంలో ఇథియోపియా, నైజీరియా తరువాత అత్యధిక జనాభా కలిగిన దేశం ఈజిప్ట్‌ కావటం విశేషం. తాజా గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి 17.9 సెకండ్ల వ్యవధిలో ఒక శిశుజననం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జనాభా పెరుగుదల అని, ఇది దేశ భద్రతను సైతం ప్రభావితం చేస్తోందని ప్రధాని ముస్తఫా మాడ్బలీ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈజిప్ట్‌ జనాభాలో 60 శాతానికి పైగా ప్రజలు 30 ఏళ్ల వయస్సున్న యువతరం. దీనితో అరబ్‌ దేశాలలో యువతరం ఎక్కువగా వున్న దేశంగా ఈజిప్ట్‌ రికార్డులకెక్కుతోంది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత 10 శాతానికి పైగా వున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.