గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (11:47 IST)

శత్రుదేశంలో ఘోర ప్రమాదం : పట్టాలు తప్పిన రైలు 30 మంది మృతి

శత్రుదేశమైన పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ రైలు పట్టాలు తప్పి పక్కన ట్రాక్ మీద బోల్తా కొట్టింది. దీంతో ఆ బోల్తా కొట్టిన రైలును పక్క ట్రాక్ మీద ఎదురుగా వస్తున్న మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 30 మంది దుర్మరణం పాలయ్యారు. 
 
మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఇంకో 15 నుంచి 20 మంది ఆ ప్రమాదంలో నుజ్జునుజ్జయిన రైలు బోగీల మధ్య చిక్కుకున్నారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని ఘోట్కీ జిల్లా ధార్కిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. 
 
పాక్ రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. కరాచీ నుంచి సర్కోధాకు ప్రయాణికులతో వెళ్తున్న మిల్లత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి పక్కన ట్రాక్ మీద పడిపోయింది. ఆ క్రమంలో ఆ ట్రాక్ పైనే రావల్పిండి నుంచి వస్తున్న సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ .. మిల్లత్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులు సహాయ చర్యల కోసం మరో రైలును పంపించారు.
 
రైలు బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. మిల్లత్ ఎక్స్‌ప్రెస్ బోగీల్లో ఇంకా ప్రయాణికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయ చర్యలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే, బోగీలు నుజ్జునుజ్జవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 13 నుంచి 14 బోగీలు పట్టాలు తప్పాయని, అందులో 8 దాకా పూర్తిగా తుక్కుతుక్కయ్యాయని చెప్పారు. 
 
మరోవైపు, ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీలైనంత వేగంగా సహాయ చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని రైల్వే మంత్రిని ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేయాలన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.