ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (14:21 IST)

వచ్చేవారం నుంచి కరోనా కఠిన ఆంక్షల్లో సడలింపు.. ఎక్కడ?

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఓ కుదుపు కుదుపుతోంది. ఈ దేశాల జాబితాలో అగ్రదేశాలైన బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, రష్యాలు కూడా ఉన్నాయి. అయితే, బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో వచ్చే వారం నుంచి కరోనా ఆంక్షలను సడలించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. 
 
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నందున వచ్చే వారం నుంచి కరోనా ఆంక్షలను సడలించబోతున్నట్టు బ్రిటన్ దిగువ సభలో ఆయన ఓ ప్రకటన చేశారు. ఇది బ్రిటన్ పౌరలకు ఎంతో ఊరట కలిగించే అంశం. 
 
ఈ ఆంక్షల సడలింపుల్లో భాగంగా, వచ్చే గురువారం నుంచి బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొనేవారికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరికాదని, అలాగే, మాస్కులు ధరించడం, వర్క్ ఫ్రమ్ హోంలు తప్పనిసరికాదని ప్రధాని జాన్సన్ వెల్లడించారు. 
 
అదేసమయంలో రద్దీ ప్రాంతాల్లో మాత్రం తమ దేశ పౌరులు ముఖానికి మాస్కులు ధరిస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. కానీ, మాస్క్ తప్పనిసరి కాదన్నారు. కాగా, బ్రిటన్‌లో ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసులు పతాక స్థాయికి చేరడంతో గత నెల 8వ తేదీ నుంచి బ్రిటన్‌లో కఠిన ఆంక్షలను అమలు చేస్తూ వచ్చారు. ఇపుడు కేసుల తగ్గడంతో వీటిని ఎత్తివేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.