పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అలా జరుగుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్లు వుంటే ఎలా?
పాకిస్థాన్ ఆగడాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలుమార్లు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్.. తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఓవరాక్షన్ చేస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో దాదాపుగా 800 ఏళ్లనాటి బౌద్ధ కట్టడాలు, క్షేత్రాలు ఉన్నాయి. ఈ భౌద్ధ క్షేత్రాలను పాకిస్థాన్ నిర్లక్ష్యం చేసింది. కొంతమంది పాక్ ఉగ్రవాదులు ఈ క్షేత్రాలను ధ్వంసం చేస్తుండగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
చారిత్రాత్మకమైన భౌద్ద కట్టడాలపై ధ్వంసం చేయడంపై భారత్ ఫైర్ అవుతోంది. పీవోకేలో ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతుంటే పాక్ చూస్తూ కూర్చోవడం ఏమిటని భారత అధికారులు మండిపడుతున్నారు. పాక్ ఆర్మీ అధికారుల అండదండలతోనే ఉగ్రవాదులు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని భారత్ ఆరోపించింది.
ప్రాచీన, పురాతనమైన చిహ్నాలను ధ్వంసం చేయడం అనాగరికమైన చర్య అని భారత విదేశాంగ శాఖ ఆరోపిస్తోంది. వెంటనే కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తమ దేశానికీ చెందిన పురావస్తు శాఖాధికారులను అనుమతించాలని, వారిని పునరుద్దరించేలా చూడాలని పాకిస్థాన్‌ను భారత్ విజ్ఞప్తి చేసింది.