మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (15:50 IST)

విరుగుడు వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వెన్నంటే ఉంటుంది.. : డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచాన్ని కరోనా వైరస్ బంధించింది. ఈ వైరస్ ఏకంగా 210 దేశాలకు వ్యాపించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ గజగజ వణికిపోతున్నాయి. ముఖ్యంగా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలకు ఏం చేయాలో అర్థంకావట్లేదు. దీంతో ఆయా దేశాల్లో ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా ఉంది. 
 
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ హెచ్చరిక చేసింది. కరోనా మహమ్మారికి విరుగుడు వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రమాదం మనల్ని వెన్నంటే ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించాలని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి డేవిడ్ నాబర్రో పేర్కొన్నారు. ఈ వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుందని, ఈ ముప్పు నుంచి ప్రపంచం ఇప్పట్లో బయటపడే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
వైరస్ ఉనికిని ఎప్పటికప్పుడు గుర్తించడం, పాజిటివ్‌గా తేలిన వారిని ఐసోలేషన్‌లో ఉంచడం అనే ప్రక్రియను నిరంతరం కొనసాగించడమే ప్రస్తుతానికి దీన్ని ఎదుర్కొనే మార్గమని నాబర్రో అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రపంచ దేశాలన్నీ ఈ విధానాన్ని పాటించక తప్పదన్నారు. 
 
మరోవైపు, కరోనా వైరస్‌కు జన్మస్థావరమైన చైనాలో పరిస్థితులు మళ్లీ మొదటికొస్తున్నట్టుగా ఉన్నాయి. ఆదివారం ఒక్క రోజే చైనాలో 108 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. కొన్ని వారాలుగా చైనాలో అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చైనా పలు చర్యలు తీసుకుంటోంది.  
 
చైనాలో కొత్త కేసులు విదేశాల నుంచి వచ్చే వారి నుంచే నమోదవుతున్నాయని అధికారులు గుర్తిస్తున్నారు. చైనాలో కరోనా విజృంభణ తగ్గడంతో విదేశాల నుంచి చైనీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. వారి నుంచే ఈ కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు గుర్తించారు. కాగా, చైనాలో ఇప్పటివరకు మొత్తం 82160 కరోనా కేసులు నమోదు కాగా, 3341 మంది చనిపోయారు.