సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 11 ఏప్రియల్ 2020 (18:28 IST)

కరోనావైరస్: లాక్ డౌన్ ఎత్తేస్తే పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది - ప్రపంచ దేశాలకు WHO హెచ్చరిక

కరోనావైరస్ బాధిత దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంక్షలను సడలించే విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు డాక్టర్ టెడ్రొస్ అద్నామ్ గెబ్రియేసుస్ అన్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఇటలీ, స్పెయిన్ దేశాలు కొన్ని సడలింపులు ఇచ్చాయి.

 
యూరోపియన్ దేశాల్లో ఇప్పుడిప్పుడే కోవిడ్-19 మహమ్మారి తగ్గుముఖం పడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని జెనీవాలో జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్‌‌లో టెడ్రోస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంక్షల్ని సడలించే విషయంలో ఆయా దేశాలతో కలిసి డబ్ల్యూహెచ్ఓ పని చేస్తోందని, అయితే ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి లేదని అన్నారు. “వెంటనే ఆంక్షల్ని సడలించడం వల్ల మహమ్మారి మరింత తిరగబెట్టవచ్చు” అని డాక్టర్ టెడ్రోస్ హెచ్చరించారు.

 
ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఆంక్షల సడలింపులు
అత్యవసర సర్వీసులు కాని భవన నిర్మాణ రంగం, ఉత్పత్తి కర్మాగారాల్లో కార్మికుల్ని సోమవారం నుంచి విధులకు అనుమతించేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గడిచిన 17 రోజుల్లో శుక్రవారం అత్యల్పంగా అంటే 605 మరణాలు మాత్రమే అక్కడ సంభవించాయి. తాజా గణాంకాల ప్రకారం కోవిడ్-19 కారణంగా అక్కడ 15,843 మంది చనిపోయారు.

 
సామాజిక దూరాన్ని తప్పని సరిగా పాటించాలని ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేస్తూ వస్తోంది. ఇటలీలో మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు ఇటలీ ప్రధాని గుసెప్పే కాంటే. ఇన్ని రోజులుగా ఆంక్షలు పాటించడం వల్ల కల్గిన లాభాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోయే పరిస్థితి తలెత్తకూడదని పిలుపునిచ్చారు.

 
అదే సమయంలో మార్చి 12 నుంచి మూతపడ్డ చిన్న చిన్న వ్యాపారాలను మంగళవారం నుంచి తిరిగి తెరవనున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కేవలం నిత్యావసరాలు, మందుల దుకాణాలను మాత్రమే తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చారు.

 
ఇప్పుడు పుస్తకాలు, చిన్న పిల్లల వస్తువులకు సంబంధించిన షాపులు కూడా తెరవనున్నారు. అయితే బట్టలు ఉతికే దుకాణాలు సహా మరి కొన్ని ఇతర సర్వీసులు కూడా వాటిలో ఉన్నాయని స్థానిక మీడియా చెబుతోంది. ప్రస్తుతం ఇటలీలో రోజువారీ కొత్తకేసుల సంఖ్య 4,204 నుంచి 3,951కి తగ్గింది.

 
ప్రపంచంలో మిగిలిన దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?
* ఐర్లాండ్‌లో మే 5 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.

*ఇస్తాంబుల్, అంకారా సహా మొత్తం 31 నగరాల్లో 48 గంటల కర్ఫ్యూని ప్రకటించింది టర్కీ ప్రభుత్వం. సరిగ్గా 2 గంటల ముందే ఈ నిర్ణయం ప్రకటించడంతో నిత్యావసరాల కోసం షాపుల్లో జనం ఎగబడ్డారు.

*పోర్చుగల్‌ దేశంలో మే1 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగనుంది.

*లాక్ డౌన్ విషయంలో బ్రిటన్‌ మల్లగుల్లాలు పడుతోంది. అయితే పరిస్థితి కుదుటపడేంత వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని చెబుతోంది.

*లాక్ డౌన్‌ను దక్షిణాఫ్రికా మరో 2 వారాలు పొడిగించింది.

 
వైరస్ వ్యాప్తి తగ్గుతూ వస్తోందా ?
కొద్ది రోజులుగా యూరోపియన్ దేశాల్లో వైరస్ విజృంభణ తగ్గుతూ వస్తోందని ఓ వైపు డబ్ల్యూహెచ్ఓ చెబుతుంటే, అమెరికాలో కూడా ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. అయితే ఆఫ్రికా ఖండం సహా ఇతర దేశాల్లో ప్రస్తుతం ఈ వ్యాధి వేగంగా విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. సుమారు 16 దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపింది.