శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 11 ఏప్రియల్ 2020 (18:09 IST)

కరోనావైరస్: లాక్‌డౌన్ రోజుల్లో మహిళలే ఈ దక్షిణాది రాష్ట్రాలకు 'ఆశ, శ్వాస'

భారతదేశంలో లాక్ డౌన్ సమస్య తీవ్రతను తగ్గించడంలో, వీలైనంత తక్కువ సమయంలో ఉత్తమ పరిష్కారాలు చూపించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే, దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగాలకు మహిళలు అందించిన చేయూత, గొప్ప సామాజిక ప్రభావాన్ని చూపాయి.

 
ఈ శతాబ్దంలోనే అతి పెద్ద విపత్తును ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యం కాదు. అందరికీ అన్నీ అందించడానికి చాలా పెద్ద యంత్రాంగం కావాలి. దానికి బలమైన, వ్యవస్థీకృత పద్ధతులుండాలి. సరిగ్గా ఆ ఖాళీనే పూరించాయి మహిళా స్వయం సహాయక బృందాలు. ఇవే కోవిడ్-19 కాలంలో దక్షిణ భారతంలో వెలుగు రేఖల్లా మారాయి.

 
దాదాపు మొత్తం జనాభాకు వివిధ అవసరాలు ఒకేసారి పెద్ద ఎత్తున తీర్చాల్సి రావడం, వైద్యపరంగా దాదాపు ప్రతి కుటుంబాన్నీ సర్వే చేయాల్సిన అవసరం రావడం - ఈ రెండిటినీ సమన్వయం చేయడం సాధారణ విషయం కాదు. కానీ, మహిళా సంఘాలు, ఆ బాధ్యతను సమర్థంగా, సత్వరంగా చేపడుతున్నాయి. భోజనం పెట్టడం దగ్గర నుంచి ఆరోగ్యం కాపాడడం వరకూ అన్ని విధాలా వారు తమ వంతు సాయం అందిస్తున్నారు.

 
దక్షిణాదిన దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో మహిళల పాత్ర కనిపిస్తోంది. కేరళ మహిళలు ఈ విషయంలో ముందున్నారు. అక్కడ ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు సమాంతరంగా పనిచేస్తోంది కుదుంబ శ్రీ. (మలయాళంలో కుటుంబాన్ని కుదుంబ అని అంటారు).

 
కేరళను కాపాడుతున్న కుదుంబశ్రీ
కుదుంబశ్రీ.. ఇది అక్కడి మహిళా స్వయం సహాయక బృందాల సంస్థ. లాక్ డౌన్ తరవాత దేశమంతా పేదలు, వలస కార్మికుల ఆకలి కేకలు వినిపించాయి. కానీ కేరళ కుదుంబశ్రీ మహిళల కమ్యూనిటీ కిచెన్ అందరికంటే కాస్త ముందుగా వారి ఆకలి తీర్చింది.

 
అక్కడి స్థానిక సంస్థలతో కలపి కుదుంబ శ్రీ సంఘాలు ఈ వంటశాలలు ఏర్పాటు చేశాయి. పేదల దగ్గర నుంచి క్వారంటైన్లో ఉన్నవారి వరకూ అందరికీ భోజనం అందజేశాయి. మొత్తం 1304 కమ్యూనిటీ కిచెన్స్‌లో 1100 వంటశాలల్ని ఈ మహిళా సంస్థలే నడుపుతున్నాయి.

 
ఆహారం ఉచితం
కాస్త డబ్బు పెట్టగలిగిన వారి కోసం, వీటిలో 238 కిచెన్లను హోటళ్లుగా కేటాయించారు. అక్కడ 20 రూపాయలకే భోజనం దొరుకుతుంది. ఇక సరిహద్దుల్లో, లారీ డ్రైవర్లు ఎక్కువగా ఇరుక్కుపోయిన చోట, వారి కోసం 15 టేక్ అవే పాయింట్లు ఉన్నాయి. సాధారణ వ్యక్తులతో పాటూ గుర్తించిన 1,57,691 అనాథ కుటుంబాలకి కూడా ఆహారం అందుతోంది.

 
కేరళ సివిల్ సప్లైస్ శాఖ, 87 లక్షల కుటుంబాలకు ఇవ్వాల్సిన నిత్యావసరాల కిట్లను తయారు చేయడంలో వీరి సాయం అడిగింది. దానికి అదనంగా ఆ కిట్లకు కావల్సిన సంచులు కుట్టే పని కూడా వీరే తీసుకున్నారు. ఇక అంగన్‌వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం లాక్ డౌన్‌లో కూడా ఆగకుండా వీరు చూస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్ నెలకి సరిపడా అమృతం నూట్రిమిక్స్ నిల్వ పెట్టుకున్నారు. పంపిణీ కూడా జరుగుతోంది. గిరిజన ప్రాంతాలకూ ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు.

 
కొన్ని చోట్ల పడవల్లో సూపర్ మార్కెట్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు ఎక్కడా బయటకు రాకుండానే వారి అన్ని అవసరాలు తీర్చేలా చేశారు. విస్తృత నెట్‌వర్క్, సమర్థులైన సభ్యులు, వారి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ – ఈ లక్షణాలే ఇక్కడ స్వయం సహాయక బృందాలపై ప్రభుత్వాలే ఆధారపడేలా చేయగలిగాయి.

 
కౌన్సిలింగ్ కోసం స్నేహిత
కేవలం భోజనం పెట్టడమే కాదు, ఆప్యాయంగా పలకరించి మంచి చెడ్డలూ చూస్తున్నారీ మహిళలు. ఇందుకోసం స్నేహిత అనే కార్యక్రమం ఉంది. దిక్కులేని (డెస్టిట్యూట్) కుటుంబాల్లో 1,22,920 మంది వృద్ధులే ఉన్నారు. లాక్డౌన్ సమయంలో వారందరినీ రోజూ పలకరించడం కుదుంబశ్రీ పనుల్లో ఒకటి. క్వారైంటన్లో ఉన్నవారినీ పలకరిస్తారు. క్వారంటైన్లో ఉన్న వారందరూ మానసికంగా ధైర్యంగా ఉండేందుకు పలకరించాలనే నియమం పెట్టుకున్నారు.

 
ఈ పలకరింపుల పని కోసమే 2,500 మంది ఉన్నారు. ఇంతేకాదు, ఇంట్లోనే అందరూ ఉండిపోవడంతో, బయటకు వెళ్లకపోవడంతో వచ్చే మానసిక ఒత్తిడి ఎదుర్కోవడానికీ, మహిళలు గృహహింస ఎదుర్కొంటుంటే గుర్తించడానికీ కూడా స్నేహిత కౌన్సిలింగ్ కార్యక్రమం పనిచేస్తోంది.

 
1,90,000 వాట్సాప్ గ్రూపులు
కుదుంబ శ్రీ చేసిన ముఖ్యమైన పనుల్లో కమ్యూనికేషన్ ఒకటి. బ్రేక్ ద చైన్ కాంపైన్ ద్వారా చేతులు కడుక్కోవడం, దూరం పాటించడం, శుభ్రత గురించి అవగాహన కల్పించడంలో చురుగ్గా వ్యవహరించారు. వాట్సప్ ద్వారా, అది లేని చోట ప్రత్యక్షంగా ప్రచారం, అవగాహన కల్పించారు.

 
ఇంతకీ కుదుంబశ్రీ కింద ఎన్ని వాట్సప్ గ్రూపులున్నాయో తెలుసా? అక్షరాలా లక్షా 90 వేలు. అవును. వాటిలో 22 లక్షల 50 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ కోవిడ్ గురించి స్పష్టమైన సమాచారం ఎప్పటికప్పుడు చేరిపోతూ వచ్చింది. ఇంగ్లీషు, మలయాళ భాషలో రూపొందించిన పోస్టర్లను వ్యాప్తి చేశారు.

 
ఎలా సాధ్యపడింది?
నిజానికి మహిళా స్వయం సహాయక బృందాల ఉద్యమం దేశమంతా ఉంది. కానీ కొన్ని చోట్లే బాగా విజయవంతమయ్యింది. కొన్ని చోట్లే సామాజికంగా – ఆర్థికంగా ప్రభావం చూపగలిగింది. దక్షిణ భారతంలో ఈ సంఘాల ప్రభావం గ్రామీణ పేదరికాన్ని తగ్గించడంలో స్పష్టంగా కనిపించిందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.

 
కేరళ వంటి చోట్ల ఈ సంఘాలు మరింత శక్తివంతంగా, సంపన్నంగా ఎదిగాయి. ఈ కుదుంబశ్రీలను తెలుగు రాష్ట్రాల్లోని డ్వాక్రాతో దీన్ని పోల్చవచ్చు. కేరళలో 90లలో ఈ ఉద్యమం మొదలైంది. 2019 మార్చి నాటికి అక్కడ మొత్తం 2,91,507 స్వయం సహాయక బృందాలున్నాయి. వాటిపైన 19,489 ప్రాంతీయ అభివృద్ధి సంఘాలు, మరో 1064 కమ్యూనిటీ అభివృద్ధి సంఘాలు ఉన్నాయి.

 
వీటిలో 43 లక్షల 93 వేల 579 మంది మహిళలు సభ్యులుగా ఉన్నవారు. ఏ మహిళ అయినా ఇందులో చేరవచ్చు, కాకపోతే ఇంటికి ఒక్కరు మాత్రమే చేరాలి. సమగ్ర ఆర్థిక, సామాజిక, మహిళా సాధికారిత ఈ సంస్థ లక్ష్యం. సూక్ష్మ రుణాలు, సూక్ష్మ వ్యాపారాలు, ఉమ్మడి సాగు, జంతువుల పెంపకం, మార్కెట్ అభివృద్ధి, వాల్యూ చైన్ ఆధారిత వ్యవహారాలు వంటివన్నీ ఆర్థిక కార్యకలాపాల కిందకు వస్తాయి.

 
ఆశ్రయ (దిక్కులేని వారికి సాయం చేయడం), బాలసభ (పిల్లల కోసం), బడ్స్ (ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్య కోసం), ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రాజెక్టులు ఇవన్నీ సామాజిక కార్యక్రమాల కిందకు వస్తాయి. ఇక మహిళల కోసం కార్యక్రమాల గురించి చెప్పక్కర్లేదు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ కుటుంబశ్రీలు చేస్తున్నాయి.

 
వీళ్లు చేస్తున్న ప్రతీ కార్యక్రమమూ ప్రత్యేకమే. పదుల సంఖ్యలో ఇలాంటి కార్యక్రమాలు వీరు చేపడతున్నారు. వీటి వల్ల ఎందరో మహిళలు తాము ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. వ్యాపారవేత్తలుగా కొందరు ఎదిగారు. స్వయం ఉపాధి కొందరు పొందారు. కేరళ తరువాత స్థానంలో మిగిలన దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఈ సంఘాలు బలంగానే ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుల్లో ఈ సంఘాలు ఎందరో మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. స్వయం ఉపాధి పొందడానికి సహాయపడ్డాయి.

 
వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి వేదిక కల్పించాయి. అలాగే కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేశాయి. పరోక్షంగా పేదరిక నిర్మూలనకు సహాయ పడ్డాయి.

 
శానిటైజర్లు, మాస్కుల తయారీ
కరోనా వ్యాప్తిని ముందుగానే ఊహించిన కుటుంబ స్త్రీ సంస్థ శానిటైజర్లు, మాస్కులు తయారీ మొదలుపెట్టింది. 21 యూనిట్లలో నిరంతరం శానిటైజర్లు, 306 యూనిట్లలో రోజుకు 1,26,000 వేల మాస్కులు తయారు చేయడం ప్రారంభించారు. మార్చి 15 నుంచే వీరు ఉత్పత్తి ప్రారంభించారు. వీరు తమ ఉత్పత్తులును ఆసుపత్రులు, విధులు నిర్వహిస్తోన్న ప్రభుత్వ సిబ్బందికకీ అందించారు. ఇది కాకుండా పలు ప్రైవేటు సంస్థలూ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అందించారు.

 
అటు ప్రజలకు కూడా ధరలు పెరగకుండా లాభం జరిగింది. మార్చి 15-30 మధ్య వీరు 18.5 లక్షల మాస్కులు, 4492 లీటర్ల శానిటైజర్ ఉత్పత్తి చేసి రూ.2.30 కోట్ల టర్నోవర్ చేశారు. ఈ విషయంలో కేవలం కేరళ మాత్రమే కాదు, మిగిలిన దక్షిణాది రాష్ట్రాల మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మాస్కులను ఉత్పత్తి చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ మహిళా సంఘాలకూ అక్కడి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ ఆర్డర్లిచ్చాయి.

 
లక్షల సంఖ్యలో మాస్కులు వీరు ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వాటిని కొనుగోలు లేదా సరఫరా చేస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రల్లో కూడా ఈ మాస్కుల తయారీ జరుగుతోంది. తెలంగాణలోని జనగామలో శానిటైజర్ల తయారీ కూడా జరుగుతోంది

 
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు, పేదరికం వారిని ఇబ్బంది పెట్టకుండా ఈ కుటుంబశ్రీ మహిళలందరికీ ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించింది కేరళ ప్రభుత్వం. 20 వేల వరకూ రుణం ఇస్తారు. ఆరు నెలల తరువాత నుంచి, అది కూడా వాయిదాల ద్వారా ఈ సొమ్ము కట్టవచ్చు. ముఖ్యమంత్రి సాయం కింద దాదాపు 2 వేల కోట్లు అందిస్తున్నారు. ఈ బృందాలకు సాయం ఇస్తే జనానికి ఏమొస్తుందని అనుకోవచ్చు. కేరళలో దాదాపు 45 లక్షల కుటుంబాల మహిళలు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. అంటే మొత్తం కేరళలో ఉన్న కుటుంబాల్లో సగంపైగా, సుమారు 55 శాతం కుటుంబాలకు ఈ సాయం అందుతోంది.

 
ఆశా వర్కర్లే పెద్ద ఆశ
అక్రిడెటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, ఆగ్జిలరీ నర్స్ మిడ్ వైఫ్ – ఇలా చెప్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. మొదటిది ఆశా వర్కర్ పూర్తి పేరు, రెండవది ఏఎన్ఎం పూర్తి పేరు. ఇప్పుడు భారతదేశ ప్రజారోగ్య వ్యవస్థకి వెన్నెముక వీరు అంటే ఆశ్చర్యం లేదు.

 
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం పట్ల అవగాహనా, అనుకూలత లేని చోట్ల, వైద్య సౌకర్యాలు లేని చోట్ల వీరి పాత్ర ఎంతో కీలకమైనది. మామూలు రోజుల్లో వీరి పని పెద్దదే అయినా దాన్ని కాసేపు పక్కన పెడితే, కోవిడ్ సమయాల్లో ఈ మహిళలు ఏమాత్రం వెరవకుండా చేస్తోన్న డ్యూటీ ఇప్పుడు రాష్ట్రాలను కరోనా నుంచి కాపాడుతోంది.

 
లాక్ డౌన్ అమలు చేయడం వంటి మామూలు పనులు ప్రభుత్వ శాఖలు చేసినా, వైద్యం డాక్టర్లు చేసినా, అసలైన క్షేత్ర స్థాయి పని.. అంటే అవగాహన కల్పించడం, ఎవరికి ఆరోగ్యం బాలేదో గుర్తించడం. ఇంటింటికీ తిరిగి సర్వే చేయడం ఈ మహిళలే చేస్తున్నారు.

 
2018-19 నాటికి దేశవ్యాప్తంగా 9,37,107 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. వీరిలో ఆంధ్రలో 42,209, కర్ణాటకలో 39,329, కేరళ 24,359, తమిళనాడు 2,650, తెలంగాణలో 29,871, పుదుచ్ఛేరిలో 341 మంది మంది ఉన్నారు. కరోనా సమయాల్లో ఇళ్లల్లోంచి కాలు బయట పెట్టడానికే అందరూ భయపడుతున్న వేళ ఈ మహిళలు రెడ్ జోన్లు, హాట్ స్పాట్లలో ఇంటింటి సర్వేకు వెళుతున్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి, అక్కడ ఎవరికైనా ఆరోగ్యం బాగులేదా? విదేశాల నుంచి లేదా దిల్లీ నుంచి వచ్చారా? వంటి వివరాలు రాసుకుంటున్నారు.

 
ఆ తరువాత అలాంటి వారిని ప్రతీ రోజూ ఫాలో అప్ చేస్తూ, పై అధికారులకు సమాచారం ఇస్తూ, కోవిడ్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘‘ఈ కష్ట కాలంలో వాళ్లే ఆధారం. అసలు ఈ మహిళలు లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్టం. వారికి తమ పరిధిలోని ఇళ్లు, వీధులు, అక్కడి వారి ఆరోగ్య సమస్యలపై కాస్త అవగాహన ఉంటుంది. రోజూ భయపడకుండా ఇంటింటికీ వెళ్లి సమాచారం తెస్తారు. దాని ఆధారంగానే మేమేం చేసినా. వీళ్లే లేకపోతే ఎంత మంది అధికారులు ఉంటే ఏం లాభం?’’ అని బీబీసీతో వ్యాఖ్యానించారు తెలంగాణలోని ఒక జిల్లా వైద్యాధికారి.

 
’’మామూలుగా గ్రామాల్లో వెయ్యి జనాభాకు ఒక ఆశా వర్కర్ ఉంటారు. ఈ కోవిడ్ సమయంలో అవగాహన కల్పించడం, తమ పరిధిలో ఎవరికైనా అనారోగ్యం ఉందేమో చూడడం వంటివి వీరు చేస్తున్నారు. ఆ క్రమంలో కొంత ఇబ్బంది కూడా ఉంటుంది.

 
అవగాహన లేని వారు, వీళ్లు ఇంటికి వస్తుంటూనే భయపడతారు. తమను తీసుకుపోతారేమోనని. అంతేకాదు, ఇక్కడంతా బానే ఉందని చెబుతుంటారు. ఆశా వర్కర్లు ఓపిగ్గా వాళ్లకు నచ్చచెప్పి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఓ రకంగా వీరు ప్రజలకూ ప్రభుత్వానికీ వారధి’’ అంటూ ఆశా కార్యకర్తల పని గురించి చెప్పారు తెలంగాణ హెల్త్ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు ప్రేమ పావని.

 
‘ఈ విషయంలో ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాదిలో కాస్త మెరుగు. పరిస్థితులే కాదు, ఆశా వర్కర్లకు లభించే ఆదాయం, గుర్తింపు కూడా ఇక్కడ ఎక్కువ’’ అన్నారామె. మహిళలు ముందుండి కార్యక్రమాలు నడిపించడం దక్షిణ భారతంలో ముందు నుంచీ ఉంది. ఇదే కుదుంబశ్రీ కేరళ వరదల సమయంలో కూడా తన వంతు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది.

 
తుఫాన్ల సమయంలో తమిళనాడులో కొన్ని స్వయం సహాక బృందాలు కమ్యూనిటీ కిచెన్ నిర్వహించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే, వారిపై పెద్ద బాధ్యతలే పెట్టింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం, భవన నిర్మాణాలకు ఇసుక అమ్మడం వంటి బాధ్యతలను మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగించారు ఒకప్పుడు. మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ స్వయం సహాయక బృందాలు ప్రభుత్వాలకు చేదోడుగా ఉండడంతో ఫలితాల్లో స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది.