కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీతి సింగ్ అరెస్టు
ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌ను కెనడాలో అరెస్టు చేశారు. సిఖ్స ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) పేరుతో ఒక వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న గుర్‌పత్వంత్ సింగ్ పన్నూకు ఇంద్రజీత్ సింద్ అత్యంత సన్నిహితుడు. గత 2023 నుంచి ఇంద్రజీత్ సింగ్ కెనడాలో ఎఫ్.ఎఫ్.జె కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
అయితే, ఇంద్రజీత్‌పై ఆయుధాలు కలిగిఉండటం సహా పలు అభియోగాలు ఉన్నాయి. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కెనడాలోని అట్టావాలో అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. గత నవంబర్‌లోనూ కెనడా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గ్రేటర్ టొరంటో ఏరియాలోని ఒక హిందూ ఆలయం వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రమేయం ఉందని ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది.
ఇదిలావుంటే.. ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసేందుకు భారత కెనడాల మధ్య అంగీకారం కుదిరిందని ఇటీవల మన విదేశాంగ ప్రకటించింది. ఈ అంగీకారంలో భాగంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా.. 2023లో ఒక సిక్కు వేర్పాటువాది హత్య అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాలు సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నాయి.