మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (07:36 IST)

ఒక్క క్షణం ఆప్ఘాన్‌లో ఉండొద్దు : భారత పౌరులకు హెచ్చరిక

ఆప్ఘానిస్థాన్ దేశాన్ని అమెరికా సారథ్యంలోని సంకీర్ణ సేనలు విడిచి వెళ్లిన తర్వాత తాలిబన్ అరాచక శక్తుల ప్రాబల్యం పెరిగిపోతోంది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాలపై తాలిబన్లు పట్టు సాధిస్తుండడాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. అందుకే, ఆఫ్ఘానిస్థాన్‌లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని స్పష్టం చేసింది.
 
దీంతో అత్యవసరంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘాన్‌ను వీడాలని పేర్కొంది. ఆఫ్ఘాన్‌లో హింస క్రమంగా పెచ్చరిల్లుతోందని, త్వరలోనే విమాన సర్వీసులు నిలిచిపోవచ్చని, ఆ లోపే భారత పౌరులు త్వరపడి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
"ఆఫ్ఘనిస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రావిన్సులు, నగరాల మధ్య విమాన సర్వీసులు నిలిపివేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో పర్యటిస్తున్న, నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయులెవరైనా ఉంటే స్వదేశానికి వెళ్లే విమాన సర్వీసులపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉండాలి. విమాన సర్వీసులు నిలిచిపోకముందే భారత్ కు తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి" అని ఆఫ్ఘన్ లోని భారత దౌత్య కార్యాలయం పేర్కొంది.