శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (23:05 IST)

ఇండో-చైనా సరిహద్దుల్లో జే-20 ఫైటర్ జెట్స్... ఏ క్షణం ఏం జరుగుతుందో...

భారత్ - చైనా దేశాల వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తపరిస్థితులు నెలకొనివున్నాయి. ఇరు దేశాలు తమ సైనిక బలగాలతో పాటు అత్యాధునిక ఫైటర్ జెట్లను సరిహద్దులకు తరలిస్తున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలు నెలకొనివున్నాయి. 
 
తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల పరంపర ఇంకా కొనసాగుతోంది. ఇపుడు ఘర్షణలు పడే ప్రదేశమే మారింది. కానీ ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మాత్రం మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం చైనా వక్రబుద్దే. భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ఎన్నో కుయుక్తులు పన్నుతోంది. 
 
ఇందుకోసం తమ బలగాలను భారీ సంఖ్యలో వాస్తవాధీన రేఖకు తరలించి, ఉద్దేశ్యపూర్వకంగా శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతోంది. పైగా, ఓ వైపు శాంతి మాటలు చెబుతూనే, మరోవైపు మరింత సైనిక బలగాలను సరిహద్దుల్లోకి తరలిస్తోంది. సరిహద్దులకు చాలా దగ్గరగా ఉన్న వైమానిక స్థావరానికి అత్యాధునిక జే-20 స్టెల్త్ యుద్ధ విమానాలను మోహరించింది. 
 
ఎల్ఏసీకి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటన్ ఎయిర్ ఫోర్స్ కేంద్రానికి ఇప్పటికే జే-10, జే-11 విమానాలను పంపిన చైనా, వాటికి తోడుగా జే-20లను, జే-8, జే-16లను కూడా పంపింది. ఒకవేళ భారత్‌తో తలపడాల్సిన పరిస్థితులు వస్తే, ముందుగా సైన్యాన్ని పంపకుండా, విమానాల ద్వారా క్షిపణులు, డ్రోన్లను వినియోగించాలని చైనా భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
అలాగే, ఎల్ఏసీ సమీపంలో బలగాలను పెంచుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జే-20 ఫైటర్ జెట్లను చైనాకే చెందిన చెంగ్డూ కంపెనీ తయారు చేసింది. ఇవి జే సీరీస్‌లో ఐదో జనరేషన్‌కు చెందినవి. మరో 20 ఏళ్ల పాటు ఇవి అన్ని రకాల యుద్ధాల్లోనూ చైనా సైన్యానికి వెన్నుదన్నుగా నిలుస్తాయని అంచనా. రాడార్లను ఏమార్చి మరీ దాడులు చేసే సామర్థ్యం వీటి సొంతం. వీటిల్లో రష్యాకు చెందిన ఏఎల్-31 ఇంజన్ ఉంటుంది. ఈ తరహా విమానాలు చైనా వద్ద కనీసం 30 వరకూ ఉంటాయని అంచనా.
 
ఇకపోతే, భారత్ కూడా చైనా వక్రబుద్ధిని పసిగట్టి, సరిహద్దులకు కూడా మరిన్ని యుద్ధ విమానాలను మొహరించింది. లేహ్ వైమానిక స్థావరంలో సుఖోయ్-30, మిగ్ 29కేలతో పాటు సీ-17 రవాణా విమానాలు, నిఘా విమానమైన పీ-8ఐ, అపాచీ, చినూక్ హెలికాప్టర్లతో పాటు డ్రోన్లను మోహరించింది. మొత్తం మీద రెండు దేశాలూ కలిపి దాదాపు లక్ష మంది సైనికులను సరిహద్దులకు తరలించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.