గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (15:43 IST)

చైనా - అమెరికాల మధ్య దౌత్య యుద్ధం - హ్యూస్టన్‌లో చైనా ఎంబసీ మూసివేత

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చైనా - అమెరికా దేశాలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఇరు దేశాలు ప్రతీకార చర్యలకు దిగుతున్నాయి. తాజాగా, హ్యూస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేయించింది. 
 
దీనికి ప్రతీకారంగా అమెరికాపై చైనా చర్యలకు దిగింది. చెంగ్డూలోని అమెరికా రాయబార కార్యాలయ నిర్వహణకు ఉన్న అనుమతిని ఉపసంహరిస్తూ ఆ విషయాన్ని అమెరికా అధికారులకు తెలియజేసింది. అంతేకాదు, ఈ నిర్ణయం వెనకున్న కారణాన్ని కూడా వివరించింది.
 
అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా హ్యూస్టన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలంటూ అమెరికా రెచ్చగొట్టిందని చైనా ఆరోపించింది. అమెరికా తీసుకున్న అన్యాయమైన చర్యలకు ప్రతిస్పందనగా చెంగ్డూలోని అమెరికా దౌత్య కార్యాలయ నిర్వహణకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నట్టు అందులో పేర్కొంది.
 
తమ నిర్ణయం మాత్రం అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉందని చెప్పుకొచ్చింది. అమెరికాతో ఇలాంటి పరిస్థితులను తామెప్పుడూ కోరుకోలేదని, ప్రస్తుత ఈ పరిస్థితికి అమెరికాదే బాధ్యత అని నిందించింది.