ఉత్కంఠకు తెర : అమ్మయ్యా అక్కడ కూలిన చైనా లాంగ్ మార్జ్ 5బీ రాకెట్
గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చైనాకు చెందిన అతి పెద్ద లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ విడి భాగాలు హిందూ మహా సముద్రంలో కూలిపోయాయి. దీంతో దీని అవశేషాలు ఎక్కడ పడతాయోనని కొద్ది రోజులపాటు ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. భూమి వాతావరణంలోకి లాంగ్ మార్చ్ 5బీ ప్రవేశించడంతో దాని భాగాల్లో చాలా వరకు అంతకుముందే ధ్వంసమైపోయాయి. లాంగ్ మార్చ్ 5బీకి సంబంధించిన సమాచారాన్ని చైనా మాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ వెల్లడించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది.
ఈ వివరాల ప్రకారం, ఈ రాకెట్ బీజింగ్ కాలమానం ప్రకారం ఉదయం 10.24 గంటలకు (02.24 గంటలు జీఎంటీకి) భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద దీని శిథిలాలు పడ్డాయి. అంటే మాల్దీవుల సమూహానికి పశ్చిమ దిశలో మహా సముద్రంపై ఇది పడింది. అత్యధిక శిథిలాలు వాతావరణంలోనే కాలిపోయాయి.
చైనాలోని హైనన్ దీవిలో ఏప్రిల్ 29న లాంగ్ మార్చ్ 5బీ పేలిపోయింది. అప్పటి నుంచి ఏం జరుగుతుందోనని చాలా మంది ఆకాశం వైపు చూస్తున్నారు. వారి ఉత్కంఠకు ఆదివారంతో తెరపడింది. ఒకానొక సమయంలో ఇది ఢిల్లీ నడినెత్తిన పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీంతో ఢిల్లీ వాసులు భయంతో వణికిపోయారు. ఈ క్రమంలో ఆ రాకెట్ శకలాలు హిందూమహా సముద్రంలో కూలిపోయాయి.
చైనీస్ స్పేస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం, 18 టన్నుల బరువుగల ఈ రాకెట్ విడి భాగం ఎక్కడ పడుతుందోననే ఉత్కంఠకు తెరపడింది. దీని వల్ల నష్టం పెద్దగా ఉండబోదని చైనా అధికారులు చెప్తున్నారు. లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ చైనాకు చెందిన కొత్త స్పేస్ స్టేషన్‌ను భూ కక్ష్యలోకి ఏప్రిల్ 29న ప్రయోగించింది. ఇది బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10.24 గంటలకు మాల్దీవులకు సమీపంలోని హిందూ మహా సముద్రంలో పడిందని చైనా మాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ తెలిపింది.
లాంగ్ మార్చ్ తొలి ప్రయాణం 2020 మేలో జరిగింది. ప్రస్తుతం పేలిపోయిన రాకెట్ 5బీ రకాల్లో రెండోది. గత ఏడాది మొదటి లాంగ్ మార్చ్ 5బీ శిథిలాలు ఐవరీ కోస్ట్‌లో పడ్డాయి. వీటి వల్ల కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.
ఇదిలావుండగా, అమెరికా మిలిటరీ డేటాను ఉపయోగించే స్పేస్ ట్రాక్ అనే మానిటరింగ్ సర్వీస్ కూడా ఈ లాంగ్ మార్చ్ 5బీ భూమిపైకి వచ్చినట్లు, హిందూ మహా సముద్రంలో పడినట్లు ధ్రువీకరించింది.అయితే అధికారిక సమాచారం కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది.