ఆస్ట్రేలియా మంత్రివర్గంలో కుదుపు.. రేప్ ఆరోపణలపై ఇద్దరిపై వేటు!
ఆస్ట్రేలియా మంత్రివర్గంలో కుదుపు చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు మంత్రులపై వేటు వేశారు. ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా మహిళలను వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రక్షణ మంత్రి లిండా రేనాల్డ్స్‌తో పాటు, అటార్నీ జనరల్ క్రిస్టియన్ పోర్టర్‌లను ఇంటికి సాగనంపారు. ఆ ఇద్దర్నీ మంత్రి పదవి నుంచి తొలగించారు. అంతేకాదు క్యాబినెట్‌లోకి కొత్తగా మహిళా మంత్రులను తీసుకునేందుకు ప్రధాని స్కాట్ మారిసన్ ప్రయత్నాలు చేపట్టారు.
దేశంలోని మహిళల మనసు దోచేందుకు స్కాట్ కొత్త ప్రణాళిక వేసినట్లు సమాచారం. దీనికోసం ఆయన టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. మహిళల రక్షణ, ఆర్థిక స్వాలంబన పెంచేందుకు కొత్త వ్యూహాన్ని ఆ టాస్క్‌పోర్స్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
రెండేళ్ల క్రితం రక్షణ మంత్రి కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగినిపై లైంగిక దాడి జరిగింది. పార్లమెంట్‌లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగే ఆ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. హిగ్గిన్స్ అనే మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.
అయితే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో రక్షణమంత్రి లిండా ఆ ఘటన పట్ల క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వానికి మచ్చ తెచ్చిన ఈ సంఘటనతో ప్రధాని స్కాట్ మారిసన్ క్యాబినెట్‌లో భారీ మార్పులకు పూనుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, అటార్నీ జనరల్ పోర్టర్ 16 ఏళ్ల క్రితం తనను రేప్ చేశారని ఆరోపణలు చేసిన ఓ మహిళ కొన్ని రోజుల క్రితం మృతిచెందింది. ఈ ఘటన నేపథ్యంలో పోర్టర్‌ను అటార్నీ పదవి నుంచి తప్పించారు.