సిరియాలో చెలరేగిన అల్లర్లు - 745 మంది అమాయక పౌరులు మృతి
ఇస్లాం దేశాల్లో ఒకటైన సిరియాలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ప్రతీకార హత్యల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 14 యేళ్ల క్రితం మొదలైన సిరియా ఘర్షణల్లో ఇంత భారీ స్థాయిలో హింస చెలరేగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ ఘర్షణల్లో 745 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు బ్రిటన్ మానవ హక్కుల సంస్థ సిరియన్ అబ్జర్వేటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. 125 మంది ప్రభుత్వ భద్రతా బలగాల సభ్యులు, అసద్‌తో అనుబంధ సాయుధ గ్రూపులకు చెందిన 148 మంది ఉగ్రవాదులు మరణించినట్టు పేర్కొంది. లటాకియా నగరం చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు నిలిచిపోయినట్టు వివరించింది.
అసద్‌ను అధికారం నుంచి తొలగించిన మూడు నెలల తర్వాత గురువారం ఈ ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ అల్లర్లు కొత్త ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అసద్ దళాలను ప్రభుత్వ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. వ్యక్తిగత చర్యలే ఈ అల్లర్లకు కారణంగా ఉండటం గమనార్హం.