శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (10:54 IST)

కరోనా ఇమేజ్‌ను ఫోటో తీసిన శాస్త్రవేత్తలు.. అమెరికాలో ఘోరం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇమేజ్‌ను పూణేలోని శాస్త్రవేత్తలు ఫోటో తీశారు. ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి కరోనా వైరస్‌ను ఫొటో తీశారు శాస్త్రవేత్తలు. ఈ చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. ఈ ఏడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో చైనాలోని వూహాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన కేరళకు చెందిన ముగ్గురు మెడిసిన్ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. 
 
భారత్‌లో నమోదైన తొలి మూడు కేసులు ఇవే. వీరి నమూనాలను పూణెలోని ప్రయోగశాలకు పంపారు. ఆ నమూనాల నుంచి కోవిడ్-19కు కారణమైన వైరస్‌ను గుర్తించి ఫొటో తీశారు. ఈ వైరస్ చూడడానికి కిరీటంలా కనిపిస్తుండడంతో దీనికి కరోనా అనే పేరు వచ్చింది. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థమని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరింత విస్తరిస్తోంది. ముఖ్యంగా అగ్ర రాజ్యమైన అమెరికాలో కరోనా కేసులు పెరగడమే కాదు మరణాల సంఖ్య కూడా చైనాను దాటవేస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశంగా రికార్డులకెక్కిన అమెరికా.. పాజిటివ్ కేసులో విషయంలో మరింతగా దూసుకుపోతోంది. గురువారం ఒక్కరోజే అక్కడ 16,877 కేసులు నమోదుకావడాన్ని బట్టే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.