సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (09:01 IST)

కరోనా మహమ్మారిబారినపడిన సెలెబ్రిటీలు వీరే...

ప్రపంచాన్ని కరనా వైరస్ కబళించింది. ఏకంగా 192 దేశాలను పట్టి కుదిపేస్తోంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో ఇది మరింత కోరలుచాసింది. భారత్‌లోనూ మెల్లగా విజృంభిస్తోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారిలో చిన్నాపెద్దా అనే తేడాలేకుండా పోయింది. ఇప్పటివరకు అనేక మంది సెలెబ్రిటీలు ఈ వైరస్ బారిన పడి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అలాంటివారి వివరాలను పరిశీలిస్తే, 
 
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. పైగా, ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు తెలిపారు. కరోనాని ఎదుర్కొనేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తాను ప్రభుత్వాన్ని నడిపిస్తానని తెలిపారు. అలాగే, బ్రిటన్‌ వైద్య శాఖ మంత్రి మ్యాట్‌ హ్యాంకాక్‌కు కూడా వైరస్‌ సోకింది.
 
ఇకపోతే, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌కు కరోనా సోకింది. భార్య కెమెల్లాతో కలిసి స్కాట్లాండ్‌లోని నివాసంలో ఐసొలేషన్‌లో ఉన్నారు. 
 
లైంగిక నేరారోపణలు రుజువుకావడంతో 23 యేళ్ళ జైలు శిక్షను ఎదుర్కొంటున్న ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే విన్‌స్టీన్‌కు జైలులోనే కరోనా సోకింది.
 
భారత్‌లో కరోనా బారిన పడిన మొదటి సెలబ్రిటీ కనికాకపూర్‌. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆమెకు వైరస్‌ సోకింది. ఈమె ద్వారా అనేక మందికి వ్యాపించింది. దీంతో ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
ఆస్కార్‌ అవార్డు గ్రహీత టామ్‌ హాంక్స్‌, ఆయన భార్య రీటా విల్సన్‌ కూడా కరోనా బారినపడ్డారు. వీరిద్దరూ వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. 
 
కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ట్రూడో సతీమణి సోఫీ ట్రూడోకు కరోనా సోకింది. హాలీవుడ్‌ నటి ఓల్గా కురిలెంకో కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఈమె కోలుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
వీరితో పాటు.. హాలీవుడ్‌ నటులు క్రిస్టోఫర్‌ హివ్‌జు, ఇందిర వర్మ, హాలీవుడ్‌ నటి రాచెల్‌ మాథ్యూస్‌, నటుడు ఇడ్రిస్‌ ఎల్బా, భార్య సబ్రినాకు కరోనా వైరస్‌ సోకింది. ఎన్‌బీఏ స్టార్‌ కెవిన్‌ దురంత్‌కు వైరస్‌ నిర్ధారణ అయింది. కరోనా బారినపడిన తొలి బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యురాలు, వైద్య ఆరోగ్య మంత్రి నదినే డోరిస్‌. 
 
కరోనా సోకిన మొదటి అమెరికన్‌ సెనేటర్‌ రాండ్‌ పాల్‌, తొలి అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు మారియో డయాజ్‌ బలార్ట్‌. మరో సభ్యుడు బెన్‌ మెక్‌ఆడమ్స్‌కు కరోనా సోకింది. ఇరాన్‌ డిప్యూటీ వైద్య శాఖ మంత్రి ఇరజ్‌ హరిర్చి కరోనా బారినపడ్డారు. ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి పీటర్‌ డుటన్‌కు పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అయితే, వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.