బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (08:35 IST)

మానవ సంబంధాలను ఛిద్రం చేసిన కరోనా... రిక్షాలో శవం తరలింపు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కేవలం మానవ ప్రాణాలనే కాదు.. మానవ సంబంధాలనే ఛిద్రం చేస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు ఏ ఒక్కరూ ముందుకురాలేదు. దీంతో ఆ మృతదేహాన్ని రిక్షాలో తరలించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన కోసరి రాజవ్వ (56) గురువారం సాయంత్రం మృతి చెందింది. బంధువులు, శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేశారు.
 
అయితే, కరోనా భయంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెను కడసారి చూసేందుకు రాలేదు. గ్రామస్థులంటారా.. ఇక చెప్పనక్కర్లేదు. దీంతో అంత్యక్రియలు నిర్వహించడం ఎలానో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు. 
 
కనీసం పాడె మోసేందుకూ నలుగురంటే నలుగురు కూడా రాలేదు. దీంతో చివరికి చెత్తను తరలించే రిక్షాపై ఆమె మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇలాంటి దుస్థితిని ఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తీసుకొచ్చింది.