కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
కోవిడ్-19 నుంచి కోలుకున్న కొందరు రోగులకు కరోనావైరస్ పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. కానీ, తర్వాత మళ్లీ పాజిటివ్ అని తేలింది. సాధారణంగా ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందని భావిస్తారు. అందుకే, ఫ్లూ నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ అంత తొందరగా ఆ వ్యాధి రాదు. కోవిడ్-19 మాత్రం తొందరగా మళ్లీ తిరగబడుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. కారణం ఏంటి?
జపాన్‌లో ఓ 70 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు చేయగా ఆశ్చర్యకరమైన, ఆందోళన కలిగించే విషయాలు బయటపడ్డాయి. ఆయనకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ కావడంతో ఫిబ్రవరిలో టోక్యో ఆసుపత్రిలో ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. చికిత్స అందించారు.
జపాన్ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రకారం, ఆయన కోలుకుని మామూలు స్థితికి వచ్చారు. ప్రభుత్వ బస్సులు, రైళ్లలోనూ ప్రయాణించారు. కానీ, కొన్ని రోజుల తరువాత ఆయన మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు. జ్వరం వచ్చిందంటూ ఆయన ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు పరీక్షలు చేస్తే షాకింగ్ విషయం బయటపడింది. ఆయనకు మళ్లీ కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.
జపాన్‌లో అలాంటి కేసులు ఇంకా చాలానే నమోదయ్యాయి. కరోనావైరస్ నుంచి కోలుకున్నవారిలో కొంతమందికే మళ్లీ పాజిటివ్ వస్తోంది. కానీ, ఆ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కారణం ఏంటి?
14 శాతం మందికి
కోవిడ్ -19 నుంచి కోలుకున్న రోగుల్లో కనీసం 14 శాతం మందికి తర్వాత పరీక్షలు చేస్తే మళ్లీ పాజిటివ్ అని వస్తోందని స్పానిష్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (సీఎస్ఐసీ)కి చెందిన అంటువ్యాధుల నిపుణులు లూయిస్ ఎంజువానెస్ బీబీసీతో చెప్పారు.
వారికి రెండోసారి సోకిందని చెప్పలేం కానీ, వైరస్ తిరగబెట్టడం వల్ల వారు మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన అంటున్నారు. "చాలావరకు కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌ల బారిన పడి కోలుకున్నవారిలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. కానీ, కొందరిలో అది బలహీనంగా ఉంటుంది. అలాంటి వారి శరీరంలో ఎక్కడో ఒకచోట దాగి ఉన్న వైరస్ మళ్లీ తిరగబడే ప్రమాదం ఉంటుంది" అని ఎంజువానెస్ వివరించారు.
శరీరంలో మూడు నెలలు
కొన్ని వైరస్‌లు మానవ శరీరంలో మూడు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవు. "వైరస్ సోకిన వారికి చికిత్స చేసిన తర్వాత నెగెటివ్ వస్తే, వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగినట్లుగా భావిస్తారు. అయితే, పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చినా మన శరీరంలోని కణజాలంలో ఎక్కడో ఒక చోట వైరస్ ఇంకా దాక్కునే అవకాశం ఉంది. అలాంటి వైరస్ మన శరీర రక్షణ వ్యవస్థకు చిక్కకపోవచ్చు. అలా దాక్కున్న వైరస్ కొన్నాళ్లకు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది" అని ఎంజువాన్స్ చెప్పారు.
కోవిడ్ -19 విషయంలో చూస్తే, దీని నుంచి కోలుకున్న తర్వాత స్వల్ప కాలంలోనే మళ్ళీ పాజిటివ్ అని వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.