శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జులై 2020 (10:39 IST)

గాలి నుంచీ కరోనా?: శాస్త్రవేత్తల అనుమానం

గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కరోనా వైరస్‌ ప్రజలకు సంక్రమిస్తుందనేందుకు ఆధారాలున్నాయని వందలాది శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారిపై సిఫార్సులను ఈ మేరకు సవరించాలని వారు డబ్ల్యూహెచ్‌ఓకు వెల్లడించారని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

కరోనా వైరస్‌ ప్రధానంగా ఈ వ్యాధితో బాధపడే వ్యక్తి దగ్గడం, తుమ్మడం లేదా మాట్లాడినప్పుడు వెలువడే తుంపరల నుంచి వేరొకరికి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతూవస్తోంది.

అయితే గాలి ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనేందుకు ఆధారాలున్నాయని పేర్కొంటూ 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్‌ఓకు రాసిన లేఖలో వివరించారు.

ఈ అంశాన్ని వచ్చే వారం సైంటిఫిక్‌ జర్నల్‌లో పరిశోధకులు ప్రచురించనున్నారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తి దగ్గినప్పుడు వెలువడే తుంపరల పరిమాణం ఎక్కువగా ఉంటే అవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ప్రజలకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేసినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

కాగా వైరస్‌ గాలి ద్వారా సంక్రమిస్తుందనేందుకు చూపుతున్న ఆధారాలు ఆమోదయోగ్యంగా లేవని డబ్ల్యూహెచ్‌ఓ వ్యాఖ్యానించింది.