శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (10:11 IST)

రూ.కోట్లకు పడగలెత్తిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్

javad bajwa
పాకిస్తాన్ దేశం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కునిపోయింది. ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఇతర దేశాల సాయం కోరుతోంది. మరోవైపు, ఆ దేశ ఆర్మీ చీఫ్‌గా ఉన్న జావెద్ బజ్వా మాత్రం గత ఆరేళ్ల కాలంలో రూ.కోట్లకు పడగలెత్తారు. ఆయన దేశ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టే సమయంలో ఆయన భార్య పేరుమీద ఒక్క పైసా కూడా ఆస్తిపాస్తులు లేవు. 
 
ఆ తర్వాత ఒక్కయేడాదిలోనే ఆమె పేరు మీద ఏకంగా రూ.220 కోట్ల ఆస్తులు వచ్చి చేరాయి. అలా బజ్వా కుటుంబీకులు, బంధువులు కూడా భారీ మొత్తంలో ఆస్తులు సంపాదించుకున్నారు. పైగా, పలు దేశాల్లో ఆస్తులు కూడా కొనుగోలు చేసినట్టు ఫ్యాక్ట్ ఫోకస్‌కు చెందిన జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ ప్రచురించిన ఓ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించారు.
 
ఈ కథనం మేరకు బజ్వా కుటుంబ సభ్యులు, సమీప బంధువులు దేశ విదేసాల్లో కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలను ప్రారంభించారు. ఇస్లామాబాద్, కరాచీలలో వాణిజ్య సముదాయాలు ప్లాట్లను ఉన్నాయి. లాహార్‌లోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీని వారు కొనుగోలు చేశారు. 
 
ప్రస్తుత మార్కెటి విలువ బజ్వా కుటుంబం గత ఆరేళ్లలో కొనుగోలు చేసిన ఆస్తుల వ్యాపారాలు పాకిస్థాన్ కరెన్సీలో 12.7 బిలియన్ రూపాయలకు పైమాటగానే ఉంది. 2013లో బజ్వా పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2015లో ఆయన భార్య అయేషా అంజాద్ ఆస్తుల విలువ సున్నాగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాతి యేడాది మాత్రం ఆమె ఆస్తులు ఏకంగా రూ.220 కోట్లకు చేరుకున్నాయి. 
 
అదేవిధంగా నవంబరులో బజ్వా కుమారుడుతో మహనూర్ సాబిర్‌కు వివాహం జరిగింది. ఈ పెళ్లికి ముందు ఆమె పేరుమీద రూ.127 కోట్ల విలువు చేసే ఆస్తులు చేరుకున్నాయి. ఇదిలావుంటే గత ఆరేళ్లుగా ఆర్మీ చీఫ్‌గా ఉన్న బజ్వా పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో వెలువడిన ఫ్యాక్ట్ ఫోకస్ కథనం ఇపుడు ప్రకంపనలు రేపుతోంది.