ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం

elon musk
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ యేడాది నవంబరు నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్, కమలా హ్యారీస్‌లు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వీరిద్దరూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినీ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను రంగంలోకి దించారు. జులైలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన ప్రదేశం పెన్సిల్వేనియాలోని బట్లర్లో ఇద్దరూ జంటగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
 
తనపై కాల్పుల జరిగిన మాథ్యూ బ్రూక్స్‌ను 'దుష్ట రాక్షసుడు'గా ట్రంప్ అభివర్ణించారు. 'సరిగ్గా 12 వారాల క్రితం ఇదే మైదానంలో ఒక హంతకుడు నన్ను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ నన్ను ఎవరూ ఆపలేరు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను వేదికపైకి ట్రంప్ ఆహ్వానించారు. మస్క్ ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. ఇక డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారీస్ పై విమర్శలు గుప్పించారు.
 
మరోవైపు, పెన్సిల్వేనియా వేదికగా శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై ఎలాన్ మస్క్ ప్రశంసల జల్లు కురిపించారు. ఒక అధ్యక్షుడు (జో బిడెన్) మెట్లు ఎక్కలేకపోతున్నారు. మరొకరు తుపాకీతో కాల్చిన తర్వాత కూడా పిడికిలి పైకెత్తారు' అని మస్క్ అన్నారు. 
 
అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని ట్రంప్ పరిరక్షించాలంటే ఆయన తప్పక గెలవాలని అన్నారు. అమెరికన్ల జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ఎన్నికలు ఇవని అన్నారు. "మీకు తెలిసిన వారిని తెలియనివారిని అందరినీ ట్రంప్‌కు ఓటు వేయమని కోరండి' అని ఎన్నికల సభకు వచ్చినవారిని మస్క్ కోరారు. దాదాపు 7 నిమిషాలపాటు మాట్లాడిన మస్క్.. 'పోరాడండి, పోరాడండి, పోరాడండి, ఓటు వేయండి, ఓటు వేయండి' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.