గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (10:55 IST)

బాంటెన్ ప్రావిన్స్ జైల్లో అగ్నిప్రమాదం - 41 మంది ఖైదీల సజీవదహనం

ఇండోనేషియా దేశంలో ఘోరం జరిగింది. ఈ దేశంలోని బాంటెన్ ప్రావిన్స్ జైలులో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 41 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. మరో 39 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
తొలుత టంజిరంగ్ జైలు సీ బ్లాకు నుంచి ఈ మంటలు చెలరేగాయి. ఆ తర్వాత జైలు మొత్తం వ్యాపించాయి. అయితే, ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అగ్నిప్రమాదం జరిగిన జైలులో 2 వేల మందికి పైగా ఖైదీలున్నారు. 
 
అగ్నిప్రమాదం అనంతరం సహాయ చర్యల కోసం వందలాదిమంది పోలీసులు, సైనికులను రంగంలోకి దించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ వాహనాలను రప్పించారు. జైలులో మంటలు అంటుకోవడంతో సహాయసిబ్బంది ఖైదీలను సురక్షితంగా తరలించేందుకు యత్నిస్తున్నారు. 
 
బాంటెన్ ప్రావిన్సు జైలులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది మరణించారని ఇండోనేషియా న్యాయ, మానవహక్కుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి రికా అప్రింటి చెప్పారు. వీరిలో ఎక్కువగా డ్రగ్ కేసుల్లో ఖైదీలున్నారని జైలు అధికారులు చెప్పారు.