శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రష్యా నుంచి చమురు దిగుమతుల నిలిపివేతకు జీ-7 దేశాల నిర్ణయం

g7countries flags
ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండయాత్ర చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనేక ప్రపంచ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లతో పాటు యూరోపియన్ దేశాలు ఈ తరహా ఆంక్షలు విధించి అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీ-7 దేశాలన్నీ కలిసి మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని తీర్మానించాయి. 
 
ఈ జి-7 దేశాల్లో ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్, ఇటలీ, బ్రిటన్, అమెరికా దేశాలు ఉన్నాయి. ఈ రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఇంధనాన్ని నిలిపివేస్తే, తమకు ఎదురయ్యే సమస్యలపై ఆ దేశాలు స్పష్టమైన ప్రకటనను విడుదల చేయలేదు. అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 
 
అంతేకాకుండా మాస్కో ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా జీ-7 దేశాల ఐక్యతను చాటి చెప్పనుంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఇంధన మోతాదును దశల వారీగా తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నాం. అదేసమయంలో తమ దేశ అవసరాలకు సరిపడిన ఇంధన నిల్వలపై ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం అని జీ-7 దేశాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.