మద్దతు కోసం ఇమ్రాన్ ముమ్మర యత్నాలు... త్వరలో ప్రధానిగా ప్రమాణం
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ 118 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ అధినేత ఇమ్రాన్
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ 118 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇందుకోసం అవసరమైన మెజార్టీని సంపాదించుకునే పనిలో ఆయన నిమగ్నమైవున్నారు. ఇందులోభాగంగా, చిన్నాచితక పార్టీలతో ఆయన బేరసారాలు సాగిస్తున్నారు. ఈ పార్టీల మద్దతును కూడగట్టుకుంటే ఆగస్టు 14వ తేదీలోపు ఆయన దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ఇదిలావుంటే పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఇటీవల జరిగిన ఎన్నికల తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఫలితాల్లో పీటీఐ -115 సీట్లు, పాకిస్థాన్ ముస్లిం లీగ్-64 స్థానాలు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 43 స్థానాల్లో గెలిచింది. ముత్తాహిదా మజ్లిస్ ఐ అమల్ -12, ముత్తాహిదా క్వయుమి మూమెంట్ ఆరు సీట్లను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇతర సీట్లను ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 137 మంది సభ్యులు ఉండాలి. పీటీఐకి మరో 22మంది సభ్యులు తక్కువగా ఉన్నారు. స్వతంత్రులు, చిన్న పార్టీలు ఇమ్రాన్‌కు మద్దతు ప్రకటించాయి. ఆరు సీట్లు గెలిచిన ఎంక్యూఎం పార్టీతో పీటీఐ నేతలు చర్చిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో పీటీఐని ప్రభుత్వ ఏర్పాటుకు ఆ దేశాధ్యక్షుడు ఇమ్రాన్‌ను ఆహ్వానించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.