సంచలన నిర్ణయం తీసుకున్న భారత్ - పాకిస్థాన్ సైన్య బలగాలు
భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన సైనిక బలగాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి ఇక నుంచి కాల్పులు జరుపుకోకూడదని పరస్పర అంగీకారానికి వచ్చాయి. ఈ మధ్య నియంత్రణ రేఖ వెంబడి తరుచూ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
'ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడానికి, స్థిరమైన శాంతిని సాధించాలన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. హింసకు దారితీసే పరిస్థితుల వల్ల తరుచూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో డీజీఎస్‌ఎంవో స్థాయిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు' అని ఇరు దేశాల అధికారులు తెలిపారు.
ఈ పరస్పర అంగీకారం ద్వారా నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర అంగీకారం కుదిరినా సరే, నియంత్రణ రేఖ వెంబడి మాత్రం భారత్ బలగాలను మోహరించే ఉంచింది. అక్రమ చొరబాట్లను నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరపకూడదని ఇరు దేశాలు 2003లో ఒప్పందాలు చేసుకున్నాయి. అయినా... తరుచూ ఈ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తూనే ఉన్న విషయం తెల్సిందే.
ఏదేమైనప్పటికీ.. తాజా ఒప్పందం వల్ల పాకిస్థాన్‌లో కొంచమైనా మార్పు వస్తుందని భావిస్తున్నట్టు ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక అధికారి తెలిపారు. పాక్‌లో మార్పు వస్తే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని ఆయన చెప్పారు.