భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ప్రమాదం
భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందట. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ 'వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ 2019' పేరుతో ఓ నివేదికను వెల్లడించింది. ఈ సర్వేలో భారత్‌లో పత్రికా స్వేచ్ఛ రోజురోజుకు దిగజారిపోతుందని పేర్కొంది.
2019 యేడాదికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులు కేటాయించగా అందులో భారత్‌కు 140వ ర్యాంకును ఇచ్చింది. భారత్‌లో పాత్రికేయులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, పాత్రికేయులపై పోలీసులు, మావోయిస్టులు, నేర ముఠాలు, అవినీతి రాజకీయ నాయకులు హింసాత్మక దాడులు చేస్తున్నారని, జర్నలిస్ట్‌లను బెదరిస్తున్నారని సంస్థ నివేదికలో తెలిపింది.
భారత్‌లో 2018వ సంవత్సరంలో తమ వృత్తిలో భాగంగా విధులు నిర్వహించినందుకు ఆరుగురు జర్నలిస్టులు దారుణ హత్యకు గురైనట్టు గుర్తుచేసింది. మరో జర్నలిస్టు మృతి అంశంలో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. జాతీయ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియా వ్యక్తులపైన దాడులు జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
భారత్‌కు కేటాయించిన ర్యాంకును బట్టి చూస్తే పత్రిక స్వేచ్ఛ అనేది భారత్‌లో లేదు అనుకోవాల్సి వస్తుంది అని సంస్థ తన రిపోర్ట్‌లో రాసింది. సార్వత్రిక ఎన్నికల వేళ జర్నలిస్టులకు ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని చెప్పింది ఆ సంస్థ వెల్లడించిన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
కాగా, ఈ ర్యాంకుల్లో నార్వే తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా, ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్థాన్ 142వ ర్యాంకులో చేరగా, బంగ్లాదేశ్‌కు 150వ ర్యాంకు వచ్చింది. చివరి నాలుగు ర్యాంకులు విషయానికి వస్తే.. తుర్క్‌మెనిస్తాన్‌కు 180వ ర్యాంకు, ఉత్తర కొరియాకు 179వ ర్యాంకు, చైనాకు 177వ ర్యాంకు, వియత్నాంకు 176వ ర్యాంకులో ఉన్నాయి.