ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (20:42 IST)

అమెరికాలో దారుణం... ఇండోఅమెరికన్‌ ముఖంపై ఒకే ఒక గుద్దుతో మృతి (video)

man attacked
అగ్రరాజ్యం అమెరికాలోని ఓక్లహామాలో దారుణం జరిగింది. ఇండో అమెరికా పౌరుడిపై ఓ దుండగుడు పిడిగుద్దులు కురిపించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని హేమంత్ మిస్త్రీగా గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓక్లహామాలో ఓ హోటల్ మేనేజర్‌గా 59 ఏళ్ల భారతీయ - అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈయన ముఖంపై ఓ దుండగుడు అకారణంగా పిడిగుద్దులు కురిపించాడు. దుండుగుడి దెబ్బలకు తాళలేక హేమంత్ మిస్త్రీ కుప్పకూలిపోయి అక్కడే ప్రాణాలు విడిచాడు. జూన్ 22న రాత్రి 10 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. 41 ఏళ్ల రిచర్డ్ లూయిస్ అనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
హోటల్ ప్రాంగణంలో ఉండొద్దంటూ హేమంత్ మిస్ట్రీ కోరారని, దీంతో నిందితుడు ఆగ్రహంతో పిడిగుద్దులు కురిపించాడని పోలీసులు వివరించారు. దెబ్బలు తాళలేక పోయిన మిస్త్రీ స్పృహతప్పి పడిపోయారని, ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని వెల్లడించారు. చికిత్స పొందుతూ జూన్ 23న చనిపోయారని చెప్పారు. ఈ కేసులో నిందితుడు లూయిస్ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రస్తుతం ఓక్లహామా కౌంటీ జైలులో ఉంచారు. కాగా నిందితుడిని హోటల్ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని ఎందుకు అడిగారో తెలియరాలేదని, దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా హేమంత్ మిస్త్రీ గుజరాత్కు చెందినవారు.
 
మరోవైపు, అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సోమవారం రాత్రి జరిగిన వరుస కాల్పుల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. లాస్ వెగాస్‌కు సమీపంలో జరిగిన కాల్పుల్లో ఓ 13 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. 57 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్ అనే నిందితుడు ఈ కాల్పులకు పాల్పడ్డాడని నార్త్ లాస్ వెగాస్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు. అయితే కాల్పుల అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు వివరించారు.
 
నార్త్ లాస్ వెగాస్‌లోని ఒక అపార్టుమెంట్‌లో సోమవారం పొద్దుపోయాక కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో స్పందించామని అధికారులు వివరించారు. ఇద్దరు మహిళల మృతదేహాలను గుర్తించామని, ఒకరి వయసు 40 ఏళ్లు, మరొకరి వయసు 50 ఏళ్లు అని పేర్కొన్నారు. అదే అపార్టుమెంట్‌లో తీవ్రంగా గాయపడిన 13 ఏళ్ల బాలికను కూడా గుర్తించి హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. ఈ అపార్టుమెంట్‌ సమీపంలోనే మరికొంత మంది బాధితులకు సంబంధించిన సమాచారం అందిందని చెప్పారు. దర్యాప్తు చేస్తుండగా మరో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడి మృతదేహాలను గుర్తించామని చెప్పారు. మృతులంతా తుపాకీ గాయాలతో చనిపోయారని లాస్ వెగాస్ పోలీసులు వివరించారు.