అమెరికాలో భారతీయ వైద్యుడి దారుణం.. చిల్డ్రన్స్ ఆస్పత్రిలో కాల్పులు.. ఆ తర్వాత..?
అమెరికాలో ఓ భారతీయుడు అగ్రరాజ్యంలో దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా ఓ ఆసుపత్రిలోకే దూరి తుపాకీతో కాల్పులు జరిపాడు. కేన్సర్ పేషెంట్ కూడా అయిన ఆ వ్యక్తి డాక్టర్ కూడా కావడం గమనార్హం. తనకు ఏమాత్రం సంబంధం లేని ఆసుపత్రిలోకి దూరి మరీ ఈ దారుణానికి పాల్పడటంతో భారతీయ సమాజం అంతా విస్మయం వ్యక్తం చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో భరత్ కుమార్ నారుమంచి అనే 43 ఏళ్ల భారతీయుడు ఆ రాష్ట్రంలోనే డాక్టర్‌గా చాలా కాలం పాటు సేవలు అందించాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. భార్య కొన్నాళ్లుగా అతడికి దూరంగా ఉంటోంది. భరత్‌కు ఇటీవల క్యాన్సర్ ఉందని బయటపడింది. అతడు మరికొద్ది వారాలు మాత్రమే బతుకుతాడని వైద్యులు తేల్చారు.
చిన్నపిల్లల నిపుణుడిగా కాలిఫోర్నియాలో పనిచేసిన అనుభవంతో ఇటీవల టెక్సాస్ లోని ఆస్టిన్ లో చిల్డ్రన్స్ మెడికల్ గ్రూపు ఆస్పత్రిలో పార్ట్ టైమ్ విధులు నిర్వహిస్తానని దరఖాస్తు చేసుకున్నాడు. దాన్ని ఇతర కారణాలతో ఆ ఆస్పత్రి తిరస్కరించింది. దానిపై కోపం పెట్టుకున్నాడో ఏమో కానీ ఆ ఆస్పత్రినే టార్గెట్ గా చేసుకుని దారుణానికి పాల్పడ్డాడు.
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం గన్స్‌తో తను పనిచేసే ఆస్టిన్‌లోని '' చిల్డ్రన్స్ మెడికల్ గ్రూపు'' ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆ ఆసుపత్రిలో రోగులు ఎవరూ లేకపోవడంతో డాక్టర్లను టార్గెట్ చేసుకున్నాడు. తుపాకీ ఎక్కుపెట్టి అందరినీ బెదిరించాడు. ఐదుగురు డాక్టర్లను బంధీలుగా తీసుకుని గదిలో తలుపు పెట్టుకున్నాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆరు గంటల పాటు హైడ్రామాను సృష్టించారు.
పోలీసుల హెచ్చరికలతో నలుగురు డాక్టర్లను భరత్ వదిలిపెట్టాడు. లిండ్లే డాడ్సన్ అనే మహిళా వైద్యురాలిని మాత్రం గదిలోనే ఉంచి కాల్చి చంపేశాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతటి ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడో తమకు తెలియదని భరత్ తల్లిదండ్రులు వాపోతున్నారు. కేన్సర్ రావడంతో మానసికంగా కుంగిపోయి ఉంటాడని, అందుకే సంబంధం లేని ఆస్పత్రిలో ఈ దారుణానికి ఒడిగట్టాడని భారతీయ సంఘాలు చెబుతున్నాయి