బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఠాగూర్

అమెరికాలో భారత వైద్యుడి ఘాతుకం.. వైద్యురాలిని కాల్చి చంపి.. తానుకూడా..

అగ్రరాజ్యం అమెరికాలో ఓ భారతీయ వైద్యుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. భారత సంతతికి చెందిన చిన్నపిల్లల వైద్య నిపుడు డాక్టర్ భరత్ కుమార్ నారుమంచి (43) వైద్యురాలు కేథరిన్‌ లిండ్లే డాడ్సన్‌(43) కాల్చి చంపాడు. ఆ తర్వాత తాను కూడా తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లోని చిల్డ్రన్స్‌ మెడికల్‌ గ్రూప్‌ ఆస్పత్రిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, భరత్‌ కుమార్‌కు వివాహమైన భార్య, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా భార్య దూరంగా ఉంటోంది. చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా ఎక్కువ భాగం కాలిఫోర్నియాలోనే ఆయన ప్రాక్టీస్‌ చేశారు. ఇటీవల భరత్‌ కేన్సర్‌ బారినపడ్డారు. ఆయన జీవితకాలం కొన్నివారాలకే పరిమితమని వైద్యులు తేల్చారు.  
 
ఈ నేపథ్యంలో వారం క్రితం ఆయన ఆస్టిన్‌లోని చిల్డ్రన్స్‌ మెడికల్‌ గ్రూప్‌ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ తాను స్వచ్ఛందంగా పనిచేస్తానని దరఖాస్తు చేసుకున్నారు. ఆయన ఆర్జీని ఆస్పత్రి వారు తిరస్కరించారు. కాగా అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రెండు పెద్ద బ్యాగులు, ఒక తుపాకీతో ఆ ఆస్పత్రిలోకి భరత్‌ ప్రవేశించారు.
 
ఆ సమయంలో ఆస్పత్రిలో పిల్లలు గానీ రోగులు గానీ లేరు. అక్కడి ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నారుమంచి ఒక్కసారిగా తుపాకీ ఎక్కుపెట్టి లిండ్లే డాడ్సన్‌ సహా ఐదుగురు వైద్యులను బందీలుగా తీసుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసినా ఏకంగా ఆరుగంటల పాటు టెన్షన్‌ నెలకొంది. బందీలైన వైద్యుల్లో నలుగురు  తప్పించుకోవడమో, భరత్‌ విడిచిపెట్టడమో జరిగింది. 
 
అనంతరం మిగిలిన ఒకే ఒక్క వైద్యురాలు లిండ్లే డాడ్సన్‌ను భరత్‌ తుపాకీతో కాల్చి చంపారు. ఆపై తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచారు. ఆస్టిన్‌లో మంచి హస్తవాసి ఉన్న చిన్నపిల్లల వైద్య నిపుణురాలిగా కేథరిన్‌ లిండ్లే డాడ్సన్‌కు చక్కని పేరుంది. 
 
కాగా ఇంతటి ఘాతుతానికి తమ కుమారుడు ఎందుకు పాల్పడ్డాడనేది అర్థం కావడం లేదని భరత్‌ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ ఘటన తాలూకు పరిణామాలు తమను జీవిత పర్యంతం వెంటాడతాయని, డాడ్సన్‌ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.