శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (16:37 IST)

మళ్లీ ఇండో-చైనా ఘర్షణలు తప్పవా? 50 మీటర్ల దూరంలో ఇరు బలగాలు

భారత్, చైనా దేశాల మధ్య మరోమారు ఘర్షణలు తలెత్తేలా కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల బలగాలు కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. నిజానికి చైనా తన బలగలాను వెనక్కి పిలిచినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తాజాగా వెల్లడైంది. 
 
రెండు దేశాల సైనికులు అతి సమీపంలోనే మోహరించి ఉన్నట్టు గూగుల్ శాటిలైట్ ఫోటోలు నిర్ధారిస్తున్నాయి. టెంట్లు, సైనిక పోస్టులు ఏర్పాటుచేశారు. ఎంతలా అంటే వాళ్ల సైన్యానికి, మన సైన్యానికి మధ్య కేవలం 150 మీటర్ల దూరం ఉందంతే. కొన్ని చోట్ల ఆ దూరం 50 మీటర్లు కూడా లేదు.
 
ఒక యేడాది క్రితం తూర్పు లడఖ్ ప్రాంతంలోని పాంగోంగ్ సరస్సు వద్ద రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. గల్వాన్ లోయలో డ్రాగన్ సైనికులతో జరిగిన ఘర్షణలో కర్నల్ సంతోష్ బాబు సహా 22 మంది జవాన్లు అమరులయ్యారు. 
 
అయితే, ఆ తర్వాత చర్చలకు కూర్చున్న రెండు దేశాల ఆర్మీ అధికారులు.. బలగాల ఉపసంహరణకు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఫిబ్రవరి 11న సైనికులను వెనక్కు పిలిపించుకున్నారు. అయితే, అదే రోజు ఆ ప్రాంతంలో మన సైనికులు, చైనా సైనికుల మధ్య దూరం కేవలం 150 మీటర్లేనని తేలింది. 
 
ఇటీవలే గూగుల్ ఎర్త్ ప్రోలో దానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను అప్ డేట్ చేశారు. పాంగోంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో రెజాంగ్ లా ఏరియా వద్ద భారత్, చైనా సైనికులు టెంట్లు, పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఆ ఫొటోల్లో తేలింది. అయితే, కైలాష్ వంటి శ్రేణుల్లో ఆ దూరం కేవలం 50 మీటర్లే ఉందని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.
 
ఆ ప్రాంతంలో భారత్‌కు చెందిన రెండు పెద్ద పోస్టులున్నట్టు ఫొటోల ద్వారా తెలుస్తోంది. అయితే, వాస్తవాధీన రేఖ వెంబడి భారత సరిహద్దుల్లోనే ఆ సైనిక పోస్టులను ఏర్పాటు చేశామని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ఆర్టిలరీ గన్నులు, ఇతర ఆయుధాలు, పరికరాలను చైనా అక్కడికి తరలించినట్టు తేలింది. ఫేస్ ఆఫ్ జరిగిన ప్రాంతం నుంచి జస్ట్ 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ మోహరింపులు జరిగాయని తేల్చాయి.