ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (09:43 IST)

బోర్డింగ్ వీసాపై ఉంటున్న భారతీయుడిని కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు

gunshot
ఆస్ట్రేలియా పోలీసులు ఘాతుకానికి పాల్పడ్డారు. బోర్డింగ్ వీసాపై ఉంటున్న ఓ భారతీయుడిని కాల్చిచంపేశారు. మృతుడిని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహ్మద్ రహమతుల్లా అహ్మద్(32)గా గుర్తించారు. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడవడమే కాకుండా పోలీసులను సైతం బెదిరించాడు. దీంతో అహ్మద్‌ను కాల్చి చంపినట్టు ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. మరోవైపు, ఈ కాల్చేవిత ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొంది. ఈ విషయాని విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతో పాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపింది. 
 
అయితే, భారతీయుడిని కాల్చివేత ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు స్పందిస్తూ, సిడ్నీ ఆబర్న్ రైల్వే స్టేషన్‌లో అహ్మాద్ ఓ క్లీనర్‌ (28)ను కత్తతో పొడిచి దాడిచేశాడు. ఆ తర్వాత ఆబర్న్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, ఆ సమయంలో స్టేషన్ నుంచి బయటకు వెళుతున్న ఇద్దరు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పైగా, వారిపై దాడికి యత్నించాడు. 
 
దీంతో అహ్మద్‌పై పోలీస్ అధికారి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అందులో రెండు బుల్లెట్లు ఛాతిలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అహ్మద్‌ ప్రవర్తించిన తీరుతో ఆయనపై కాల్పులు జరపడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు వెల్లడించారు.