సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 జులై 2022 (11:21 IST)

కరాచీలో అత్యవసరంగా భారత విమానం ల్యాండింగ్

indigo
భారత్‌కు చెందిన ఇండిగో విమానయాన సంస్థకు చెందిన విమానం అత్యవసరంగా పాకిస్థాన్‌లో ల్యాండింగ్ చేశారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఈ విమానానికి కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కల్పించారు. 
 
యూఏఈలోని షార్జా నగరం నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఈ విమానంలో మార్గమధ్యంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్‌ గుర్తించారు. దీంతో అత్యవసరంగా కరాచీలో ల్యాండ్‌ చేశారు. ప్రస్తుతం అక్కడే తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
 
ప్రయాణికులను తరలించడం కోసం ఇండిగో మరో విమానాన్ని అక్కడకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, భారత్‌కు చెందిన ఓ విమానం ఇలా పాక్‌లో ల్యాండ్‌కావడం గత రెండువారాల్లో ఇది రెండోసారి. 
 
గతవారం స్పైస్‌జెట్‌కు చెందిన ఢిల్లీ - దుబాయ్ విమానం ఇంధన ట్యాంకులో లోపం తలెత్తి ఉన్నఫళంగా కరాచీలో ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. తర్వాత ఓ ఇండికేటర్‌ లైట్‌లో లోపాన్ని గుర్తించారు. దీంతో విమానయాన నియంత్రణా సంస్థ డీజీసీఏ జులై 6న స్పైస్‌జెట్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. 
 
ఈ మధ్యకాలంలో దేశీయ విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల స్పైస్‌జెట్‌కు చెందిన పలు విమానాలు అత్యవసరంగా ల్యాండయిన విషయం తెలిసిందే. డీజీసీఏ ఈ సంస్థకు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది. ఇండిగోలోనూ ఇటీవల ఈ తరహా సమస్యలు వెలుగులోకి వచ్చాయి.