శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జులై 2020 (16:39 IST)

ఇరాన్‌లో పెరుగుతున్న కేసులు.. 138 వైద్య సిబ్బంది మృతి

కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ ఇరాన్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో కరోనా వైరస్ వల్ల 138 మంది వైద్య నిపుణులు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. 
 
కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతూ ఇప్పటివరకు 138 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరణించారని ఇరాన్ సర్కారు పేర్కొంది. మరణించిన వారిలో 90 మంది వైద్యులు, 28 మంది నర్సులు ఉన్నారని ఇరాన్ ఆరోగ్య సంరక్షణ నిపుణుల రెగ్యులేటరీ బాడీ ప్రతినిధి వెల్లడించారు.
 
మరోవైపు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. 
 
తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15,116,495 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 620,032 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 9,134,209 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా 239,924 పాజిటివ్ కేసులు, 5,678 మరణాలు సంభవించాయి.