1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (09:26 IST)

హిజాబ్ ధరించకపోవడం వల్లే వర్షాలు కురవడం లేదు : ఇరాన్ మతగురువు

Iran Imam
ప్రస్తుతం హిజాబ్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ హిజాబ్ అంశం ఇరాన్ దేశాన్ని కుదిపేసింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాంటి హిజాబ్‌పై ఇరాన్ మతగురువు ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించకపోవడం వల్లే ఇరాన్ దేశంలో వర్షాలు కురవడం లేదని వ్యాఖ్యానించి సరికొత్త చర్చకు తెరలేపారు. ఆయన పేరు మహ్మద్ మెహదీ హుస్సేనీ హమేదాని. దేశంలోని కొందరు మహిళలు హిజాబ్ ధరించకపోవడం వల్లే వర్షాలు కురవడంలేదన్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఇరాన్ దేశ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనివున్నాయి. వర్షాల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ దేశం గత యేడాది అట్టుడికిపోయిన విషయం తెల్సిందే. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంతో 22 యేళ్ల కుర్దిష్ యువతి మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె వారి కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయింది. 
 
అమిని మరణం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. హిజాబ్ వద్దంటూ మహిళలు రోడ్డెక్కారు. హిజాబ్‌లను తీసి నడిరోడ్డుపై మంటల్లో వేసి తగలబెట్టారు. దేశమంతా పాకిన ఈ అల్లర్లతో దిగి వచ్చిన ఇరాన్ ప్రభుత్వం నైతిక విభాగం పోలీస్ (మొరాలిటీ పోలీసింగ్)ను రద్దు చేసింది.