ఇజ్రాయేల్ దాడులకు భయపడి సొంరంగంలో దాక్కున్న యాహ్యా సిన్వర్
ఇటీవల ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో హమాస్ మిలిటెంట్ అధినేత యాహ్యా సిన్వర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఇజ్రాయేల్ సైన్యం సిన్వర్‌కు సంబందించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఓ సొరంగ మార్గంలోకి సిన్వర్, అతడి భార్య వెళ్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. గతేడాది అక్టోబరు 7వ తేదీనాటి దాడులకు కొన్ని గంటల ముందు సిన్వర్ ఈ సొరంగంలోకి వెళ్లి దాక్కున్నట్లు ఇజ్రాయేల్ దళాలు పేర్కొన్నాయి.
సిన్వర్, అతడి భార్య, పిల్లలు కలిసి పలు వస్తువులను పట్టుకుని సొరంగంలోకి ప్రవేశిస్తున్నట్లు వీడియలో కనిపిస్తోంది. ఇది అతడి ఇంటి కింద ఏర్పాటు చేసుకున్న సొరంగం అని ఇజ్రాయేల్ ఆర్మీ ప్రతినది డానియల్ హంగేరీ పేర్కొన్నారు. గత యేడాది తమపై దాడులు చేసినప్పటి నుంచి సిన్వర్ ఈ సొరంగంలోనే ఎక్కువ సమయం గడిపినట్లు వెల్లడించారు. అక్కడ వారు ఏర్పాటుచేసుకున్న సౌకర్యాలతో పాటు దళాల తనిఖీల్లో దొరికిన నగదు, పత్రాలకు సంబంధించిన ఫొటోలను విలేకరుల సమావేశంలో హగేరీ చూపించారు.
ఐడీఎఫ్ విడుదల చేసిన వీడియోలో సిన్వర్ భార్య చేతిలో ఓ హ్యాండ్ బ్యాగ్ ఉంది. దీని విలువ 32,000 డాలర్లు (రూ.26 లక్షలకు పైగా) ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఐడీఎఫ్ అధికారి అవిచాయ్ అడ్రే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'గాజా ప్రాంతంలోని ప్రజలు కనీస అవసరాలకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ, సిన్వర్, అతడి భార్యకు డబ్బుపై ఉన్న ప్రేమకు ఇది ఒక ఉదాహరణ' అని ఆయన విమర్శించారు.
గతేడాది అక్టోబరు 7వ తేదీన హమాస్ ఉగ్రవాదుల మెరుపుదాడితో ఇజ్రాయేల్ ఉలిక్కిపడింది. ఆ ఘటనలో 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 250 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. దీంతో ఈ దాడులకు సూత్రధారి అయిన సిన్వర్‌ను హతమర్చాలని ఇజ్రాయేల్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో సిన్వర్ మృతి చెందాడు. డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతి చెందింది హమాస్ అధినేతేనని ఇజ్రాయేల్ నిర్ధరించి విషయం తెల్సిందే.