సెక్స్ ట్రాఫికింగ్ కేసులో కీలక నిందితుడు జైలులో అనుమానాస్పద మృతి
అమెరికాలో సెక్స్ ట్రాఫికింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. ఈయన అమెరికాలోవున్న ప్రముఖ ఫైనాన్షియర్లలో ఒకరు. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆయన జైలు జీవితం గడుపుతుంటే కేసు విచారణ సాగుతోంది. ఈ కేసులో దోషిగా తేలినపక్షంలో ఆయనకు 45 యేళ్ళ జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆయన అనుమానాస్పదంగా చనిపోవడం ఇపుడు మిస్టరీగా మారింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక సహజంగా మరణించాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అనేక మంది మైనర్ అమ్మాయిలను అత్యాచారం చేశాడని ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు ఉన్నాయి. అతన్ని గత జూలైలో అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లారు.
ఆ తర్వాత ఆయన పలుమార్లు జైలులో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనిపై నిఘా కూడా పెట్టారు. కానీ ఎప్‌స్టీన్ మృతికి ముందు ఆ నిఘాను ఎత్తివేశారు. జైలు సెల్‌లోనే అతని శవాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఎప్‌స్టీన్‌పై నష్టపరిహారం కేసులు వేసిన అమ్మాయిలు గగ్గోలుపెడుతున్నారు.
అమెరికాలో మేటి ఫైనాన్సర్‌గా ఎప్‌స్టీన్‌కు గుర్తింపు ఉంది. అతనికి ఆ దేశ మేటి రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయి. అతని ఫ్రెండ్స్ లిస్టులో బిల్ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అయితే ఆ సంబంధాలు బయటపడుతాయన్న ఉద్దేశంతోనూ ఎప్‌స్టీన్‌ను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వందలాది డాలర్లను ఎర చూపి ఎప్‌స్టీన్ అనేక మంది అమ్మాయిలను అనుభవించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి జెఫ్రీ జైలు బోనులో మరణించడం ఇపుడు మిస్టరీగా మారింది.