బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (15:11 IST)

జో బైడెన్ దూకుడు : 48 గంటల్లో 30 ఆదేశాలు

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించిన ఆయన... అధికారం చేప‌ట్టిన 48 గంటల్లోనే 30 ఆదేశాల‌పై సంత‌కాలు చేశారు. ట్రంప్ విధానాల‌ను శ‌ర‌వేగంగా ఆయ‌న ర‌ద్దు చేస్తున్నారు. 

ముఖ్యంగా, క‌రోనా వైర‌స్ సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టంమేకాకుండా.. ట్రంప్ విధానాల‌ను ర‌ద్దు చేసేందుకు బైడెన్ ఉత్సుక‌త చూపిస్తున్నారు. 30 ఎగ్జిక్యూటివ్ ఆదేశాల్లో.. బెర్లిన్ సరిహద్దు గోడ నిర్మాణం కోసం నిధుల‌ను నిలిపివేయాల‌ని ఆదేశించారు. 

ముస్లిం దేశాల‌పై ఉన్న ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయ‌డం.. మాస్క్ త‌ప్ప‌నిస‌రి లాంటి ఆదేశాలు ఉన్నాయి.  ట్రంప్ రూపొందించిన సుమారు ప‌ది విధానాల‌ను రివ‌ర్స్ చేస్తూ బైడెన్ ఆదేశాలు ఇచ్చారు. పర్యావరణ పరిక్షణ కోసం పారిస్ ఒప్పందంలో చేరడం, తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహకారం అందించడం వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి. 

కరోనాకు దూరండా ఉండాలంటే మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోవద్దని బైడెన్ సూచించారు. వేరే దేశాల నుంచి వచ్చే వారు.. విమానం ఎక్కడానికి ముందే కరోనా టెస్ట్ చేయించుకోవాలని, అమెరికాకు వచ్చాక కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 

కాగా, జో బైడెన్ జారీ చేసిన ఆదేశాల వివరాలను పరిశీలిస్తే, 
*  విదేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరి టెస్ట్, క్వారంటైన్.
*  ప్రభుత్వ, అంతర్రాష్ట్ర రవాణా కేంద్రాల్లో మాస్క్ ను తప్పనిసరిగా పెట్టుకోవాలి.
*  మెడికల్ షాపుల ద్వారా కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేసే కార్యక్రమం ప్రారంభం.
*  వ్యాక్సిన్ల సంఖ్య, ఇతర పరికరాల ఉత్పత్తి పెంపునకు రక్షణ ఉత్పాదక చట్టం అమలు.
*  ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల నిర్మాణం.
*  మొదటి వంద రోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సిన్.
*  సురక్షితంగా స్కూళ్లు, కాలేజీలు, పిల్లల సంరక్షణ కేంద్రాల ప్రారంభానికి మార్గదర్శకాలు.
*  ఉద్యోగులకు మరింత కట్టుదిట్టమైన భద్రతా హక్కులు.
*  టెస్టులను పెంచేందుకు, కరోనా వ్యవహారాలు చూసేందుకు ఓ కొత్త సంస్థ.
*  కరోనాతో కుదేలైన మైనారిటీ వర్గాలకు వనరులు, వసతి కల్పన.