గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (15:51 IST)

కాబూల్‌ను ఖాళీ చేసిన బ్రిటన్ సైనిక దళాలు

ఆప్ఘనిస్థాన్‌ దేశంలో అమెరికా సారథ్యంలోని సంకీర్ణ సేనుల గత రెండు దశాబ్దాలుగా తాలిబన్ తీవ్రవాదులతో యుద్ధం చేశాయి. అయితే, అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ అధికార పగ్గాలు స్వీకరించిన తర్వాత తమ దళాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాయి. దీంతో బ్రిటన్ సేనలు కూడా ఆ దేశ ప్రభుత్వం వెనక్కి పిలిచింది. అలా, సంకీర్ణ దళాలు ఆప్ఘాన్‌ను వీడకముందే తాలిబన్ తీవ్రవాదులు ఆప్ఘాన్‌ను ఆక్రమించేశాయి. 
 
ఇదిలావుంటే, ఆప్ఘన్ నుంచి బ్రిటన్‌ సైనికులు స్వదేశానికి ప్రయాణమయ్యారు. ఈ మేరకు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సైనికులతో కూడిన చివరి విమానం కాబూల్‌ నుంచి బయల్దేరిందని ఆ దేశ రక్షణశాఖ వెల్లడించింది. 
 
ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత 15 వేలకుపైగా మందిని అక్కడి నుంచి తరలించామని పేర్కొంది. మన సాయుధ దళాలను చూసి గర్వపడాలని, మెరుగైన జీవనం గడపడానికి వస్తున్న వారికి స్వాగతం చెబుతున్నామని బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ అన్నారు. 
 
2001, సెప్టెంబర్‌ 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన దాడి తర్వాత అల్‌ఖైదా ఉగ్రవాదులపై పోరాటం ప్రారంభమయ్యిందని, 20 ఏండ్లపాటు జరిగిన ఈ పోరులో తమ దేశానికి చెందని 450 సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 
 
ఈ నెలాఖరు తర్వాత ఆఫ్ఘన్‌ నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకుంటామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో బ్రిటన్‌ కూడా విదేశీ కార్యాలయాన్ని మూసివేసింది. శుక్రవారం 800 నుంచి 11 వందల మందని ఆఫ్ఘన్లను అక్కడి నుంచి బ్రిటన్‌కు తరలించామని వాలెస్‌ చెప్పారు.