గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (08:43 IST)

కరేబియన్ దీవుల్లో పేలిన విమానం... 9 మంది మృతి

వెస్టిండీస్ దేశంలోని కరేబియన్ దీవుల్లో ఓ విమానం పేలిపోయింది. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో లాటిన్ దేశానికి చెందిన మ్యూజిక్ ఆర్టిస్ట్ ప్యూర్టో రికాన్ కూడా ఉన్నారు. 
 
మొత్తం ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ఓ ప్రైవేటు విమానం డొమినికాన్‌లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడాకు బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాలకే రాజధాని శాంటో డొమింగోలో ఉన్న లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 
 
అయితే, విమానం చక్రాలు రన్‌వైపును తాకగానే ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని విమానయాన సంస్థ తెలిపింది. ఈ మృతుల్లో ఆరుగురు విదేశీ ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని పేర్కొంది. అయితే, ఈ ప్రయాణికులు ఏ దేశానికి చెందినవారన్న విషయంపై క్లారిటీ లేదు. ఒకరు మాత్రం డొమినికాన్ పౌరుడని స్థానిక మీడియా తెలిపింది.