నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా
తాను బతికే ఉన్నానని, బతికే ఉంటానని బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అన్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలా చెలరేగిన విద్యార్థులు ఆందోళనలతో ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా... గత యేటాది ఆగస్టు 5వ తేదీన ఆ దేశాన్ని వీడి, భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఓ రహస్య ప్రదేశంలో ఉంటున్నారు.
అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఢాకా అల్లర్ల కేసులో ఆమెకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు వెలువడేందుకు ముందు కూడా తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేశారు. ఎవరూ బాధపడొద్దని అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు.
'నేను బతికే ఉన్నాను.. ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం నా పనిని ప్రారంభిస్తాను. వాళ్లు ఏ తీర్పు అయినా ఇవ్వనివ్వండి. నాకు సంబంధం లేదు. దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు. అప్పటివరకు నా ప్రజల కోసం పనిచేస్తాను. ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు, తోబుట్టువులను పోగొట్టుకున్నాను. వారు నా ఇంటిని కాల్చివేశారు. గోనో భవన్ (బంగ్లా ప్రధానమంత్రి అధికారిక నివాసం) నా ఆస్తి కాదు. అది ప్రభుత్వానిది. నేను దేశం వీడిన తర్వాత దానిలో లూటీ జరిగింది. అది విప్లవం అని వారు చెప్తున్నారు. గూండాలు, ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరు' అని ఆమె మండిపడ్డారు.