1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 డిశెంబరు 2021 (13:33 IST)

మాలిలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ నరమేథం

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థల్లో ఒకటి ఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో నరమేథం సృష్టించింది. 50 మందితో వెళుతున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల కారణంగా ట్రక్కు మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులోని ప్రయాణికుల్లో 31 మంది మృత్యువాతపడ్డారు. 
 
దీనిపై బండియగర నగర మేయర్ హుస్సేనీ సాయే స్పందిస్తూ, అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన తీవ్రవాదులు ప్రయాణికుల ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ట్రక్కుకు మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. దీంతో ట్రక్కులో ఉన్న 50 మంది ప్రయాణికుల్లో 31 మంది సజీవదహనమయ్యారని చెప్పారు. 
 
మిగిలిన వారు తీవ్రంగా గాయపడినట్టు వివరించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఈ దారుణ ఘటనకు ఏ ఒక్క ఉగ్రసంస్థ నైతిక బాధ్యత వహించకపోయినప్పటికీ అల్‌ఖైదా అనుబంధ సంస్థే ఈ దారుణానికి పాల్పడిందని ఆయన అభిప్రాయపడుతున్నారు.