శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

ఉగ్రవాదులుగా భావించి భద్రతా బలగాల కాల్పులు - 14 మంది పౌరులు మృతి

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్‌లో దారుణం జరిగింది. భారత భద్రతా బలగాలు పెద్ద తప్పు చేశారు. సాధారణ పౌరులను ఉగ్రవాదులుగా భావించారు. దీంతో వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. ఫలితంగా నాగాలాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ దారుణం మోన్ జిల్లాలోని తిరు గ్రామంలో జరిగింది. 
 
అంతకుముందు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సాధారణ పౌరులను భద్రతా బలగాలు ఉగ్రవాదులుగా భావించి, ఈ కాల్పులు జరిపారు. మోన్ జిల్లా తిరు గ్రామంలోని ఓటింగ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పలువురు జవాన్లు మృతిచెందారు. 
 
దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట చేపట్టింది. ఆ సమయంలో అటుగా వస్తున్న తిరు గ్రామానికి చెందిన కూలీలపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో 14 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం రాత్రి జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హింసకు పాల్పడ్డారు. ఎన్ఎస్సీఎన్ మిలిటెంట్లుగా పొరపాటున అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీస్తుంది.