గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

దీపావళి సెలవు కోసం గొడవ : కాల్పుల్లో నలుగురి మృతి

తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని మారాయిగూడెం వద్ద లింగంపల్లి బేస్‌ క్యాంప్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మధ్య సెలవుల విషయంలో ఘర్షణ తలెత్తింది. దీంతో ఓ జవాన్‌ తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
 
సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీపావళి సెలవుల విషయంలో సీఆర్‌పీఎఫ్ 50వ బెటాలియన్ జవాన్ల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వివాదం తీవ్ర ఘర్షణగా మారింది. అది మరింత ముదరడంతో సంయమనం కోల్పోయిన జవాన్లు పరస్పరం కాల్పులకు తెగబడ్డారు.
 
ఈ ఘటనలో బీహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి, బెంగాల్‌కు చెందిన రాజుమండల్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ధర్మేందర్ అనే మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.