మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (20:26 IST)

చత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

చత్తీస్ ఘడ్ రాష్ర్టంలోని మావోయిస్టులకు ఒకదాని వెనక ఒక్కటి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. పోలీసులు మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్న సందర్భంలో వరసగా రెండు వారాల్లోనే మూడవ సారి ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది.

గత కొద్ది రోజుల క్రితం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ అడవుల్లో  పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరగ్గా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, కొద్ది రోజుల్లోనే దంతేవాడ జిల్లాలోని అడవుల్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో పోలీసులదే పై చేయ్యి అయ్యింది. మరో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

ప్రస్తుతం  ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. ప్రభుత్వ నిషేధిత మావోయిస్టుల కోసం దంతెవాడ డీఆర్‌జి బలగాలు గాలిస్తుండగా, ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు దంతెవాడ ఎస్‌పి డాక్టర్ అభిషేక్ పల్లవ్ తెలిపారు.

కాల్పులు ఆగిపోయిన తర్వాత సంఘటన ప్రాంతంలో ఒక మావోయిస్టు మృతదేహం, 7.62 ఎంఎం పిస్టల్, ఐదు కిలోల ఐఈడీ, వైరు ఇతర పేలుడు సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ మృతుడు 16వ నంబర్ ప్లాటూన్ కమాండర్ రామ్స్‌గా గుర్తించారు.

డీవీసీఎం సభ్యుడు మల్లేష్‌కి గార్డుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇతనిపై రూ 5 లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.