ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (12:54 IST)

ఆర్కిటిక్‌ నుంచి వీస్తున్న గాలులు.. అమెరికాలో టోర్నడోలు.. 20 మంది మృతి

ఆర్కిటిక్‌ నుంచి వీస్తున్న బలమైన చలిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో టోర్నడోతో అమెరికా విలవిలలాడుతోంది. తుఫాను విలయంతో టెక్సాస్‌లో ఇప్పటికే 20మంది మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలు మంచు ముప్పులో కూరుకుపోయాయి. 
 
భారీగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కనీసం ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి కూడా వీల్లేకుండా రహదారులన్నీ మంచుతో కప్పేసి ఉన్నాయి. విమానాలను రద్దు చేశారు. సుమారు 15 కోట్ల మంది అమెరికన్లు మంచు ముప్పులో ఉన్నట్లుగా 'ది నేషనల్‌ వెదర్‌ సర్వీసెస్‌' హెచ్చరించింది.
 
టెక్సాస్‌ చుట్టుపక్కల రాష్ట్రాల్లో 40 లక్షల మందికిపైగా నీళ్లు, కరెంట్‌ లేక అల్లాడిపోతున్నారు. టెక్సాస్‌లో పైపుల్లో నీరు గడ్డ కట్టుకపోవడంతో ప్రజలు నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ ప్లాంట్లు సరిగా పని చేయడం లేదు. దీంతో టెక్సాస్‌ సహా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. తన నగరంలో 1.3 మిలియన్ల మందికి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని హోస్టన్‌ మేయర్‌ సిల్వెస్టర్‌ టర్నర్‌ అన్నారు. వీలైనంత త్వరగా విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నామని.. ఇదే మొదటి ప్రాథాన్యత అని అన్నారు. 
 
డల్లాస్‌ - ఫోర్ట వర్త్‌లో మైనస్‌ 17 సి డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైందని అన్నారు. 1903లో మైనస్‌ 11 డిగ్రీలు నమోదై రికార్డు సృష్టించిందని.. అనంతరం ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అన్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. 
 
కెంటకీలో మరింత బలంగా చలి గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలన్నీ పాటించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ఇప్పటికీ 27 లక్షల మందికిపైగా ప్రజలు చీకట్లోనే మగ్గిపోతున్నారు.