15 నిమిషాల పాటు దర్చులా వంతెనను తెరిచారు.. 12 నిమిషాల్లో పెళ్లి తంతు పూర్తి
కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వివాహాలు ఏదో మొక్కుబడిగా జరిగిపోతున్నాయి. ముందులా వివాహాలకు జనాలు రారు. పెళ్లి వేడుకలు ప్రస్తుతం 30 మందితో జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. ఇండో-నేపాల్ పరిపాలనా యంత్రాంగాలు 15 నిమిషాల పాటు అంతర్జాతీయ వంతెనను ఓ జంట వివాహంతో ఒక్కటయ్యేందుకు తెరిచాయి.
పెళ్లి ఊరేగింపు లేకుండానే వరుడు తన తండ్రితో కలిసి నేపాల్‌లోని దర్చులాలో జరిగే తమ వివాహ వేడుకకు హాజరయ్యాడు. వీరి వివాహం కేవలం 12 నిమిషాల్లో ముగిసింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో.. నేపాల్ పరిపాలనా విభాగం అనుమతితో భారత్‌లోని పిథోరాగఢ్‌కు చెందిన కమలేష్ చంద్ తన వివాహం కోసం నేపాల్‌లోని దర్చులాకు చేరుకున్నాడు.
పెళ్లికి వరుడు, అతని తండ్రి మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ అనుమతి మేరకు 15 నిముషాల పాటు ఝూలాపూల్ తెరిచారు. దర్చులాలో వరుడు, వధువు దండలు మార్చుకున్నారు. వెంటనే ఆ కొత్త దంపతులు భారత్‌కు తిరిగి వచ్చారు. కాగా మార్చి 22న వీరి వివాహం జరగాల్సివుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడింది.